డిశంబర్‌ 28న‌ ‘భజగోవిందం’ ప్రారంభం

డిశంబర్‌ 28న‌ ‘భజగోవిందం’ ప్రారంభం

హైదరాబాద్‌, డిశంబర్‌-23, 2009: తిరుమల తిరుపతి దేవస్థానములు, హిందూధర్మప్రచారపరిషత్‌, రాష్ట్రదేవదాయ ధర్మదాయశాఖ సంయుక్తంగా భజగోవిందం కార్యక్రమాన్ని 2008లో ప్రారంభించింది. ఈ ఏడాది డిశంబర్‌ 28వ తేది సోమవారం నాడు భజగోవిందం ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమంలో వైకురఠఏకాదశి పర్వదినాన రాష్ట్రంలోని అన్ని దేవాలయాలలో విష్ణుసహస్రనామ పారాయణాలు జరుగుతాయి. అంతేకాక ఆలయ ప్రాంగణంలో భజనలు, పురాణప్రవచనము, అన్నమయ్య సంకీర్తనలు స్థానిక భక్త బృందాలచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించబడతాయి. సాయంత్రం 5 గంటలకు నగర సంకీర్తనా కార్యక్రమం సామూహికంగా జరుగుతుంది. ధార్మిక చైతన్యం సమైక్యంగా గ్రామగ్రామాన వెల్లివిరుస్తుంది.

తిరుమల తిరుపతి దేవస్థానముల నుంచి శ్రీవారి కుంకుమ, అక్ష్షతలు, కలకండ, మహాప్రసాదం పాకెట్లు, విష్ణుసహస్రనామ పుస్తక ప్రసాదం అన్ని ప్రముఖ దేవాలయాలకు, అధికారులకు, జిల్లా ధార్మికమండళ్ళద్వారా, హిందూ ధర్మప్రచారపరిషత్‌ కో-ఆర్డినేటర్ల ద్వారా అందజేస్తారు.

ఈ కార్యక్రమంలో మండల ధార్మిక సేవామండళ్ళు కూడా సముచిత రీతిలో పాలుపంచుకొంటాయి. అన్ని వర్గాల ప్రజలు ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనవలసిందిగా కోరుతున్నారు. ఈసందర్భంగా రాష్ట్రంలోని దేవాలయాలను ప్రత్యేకంగా అలంకరించి స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో అన్ని దేవాలయాలకు 2 లక్షల సంఖ్యలో మహాప్రసాదం, కుంకుమ, అక్ష్షతల పాకెట్లు ఇప్పటికే తయారుచేసి జిల్లాలకు పంపబడ్డాయి. పుస్తకప్రసాదంగా లక్షకుపైగా విష్ణు సహస్రనామ పుస్తకాలు కూడా అన్ని దేవాలయాలకు ఉచితంగా పంపించడం జరిగింది.

రాష్ట్రంలో ఇప్పటికే 13,500 పైగా భజనబృందాలు హిందూధర్మ ప్రచార పరిషత్‌లో నమోదై ఉన్నాయి. వీటిలో రకరకాల భజనలున్నాయి. చిందు, కోలాటం, చిరుతలు, చెక్క, బృందావన, గోటు వంటి అనేక రకాల భజన సంప్రదాయాలున్నాయి. ఆయా సంప్రదాయాల ప్రకారం సమీపదేవాలయాలలో భజన బృందాలు కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. కొత్తభజన బృందాలు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని వారి పేర్లను నమోదు చేసుకోవచ్చు. భవిష్యత్తులో జిల్లాకు కనీసం వెయ్యి భజనబృందాలు తయారుచేసి రాష్ట్రవ్యాప్తంగా భజనపోటీలు జిల్లా స్థాయిలోను, రాష్ట్రస్థాయిలో నిర్వహించడం జరుగుతుంది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.