డిసెంబరు 11న టిటిడి స్థానికాలయాల్లో కార్తీక దీపోత్సవం
డిసెంబరు 11న టిటిడి స్థానికాలయాల్లో కార్తీక దీపోత్సవం
తిరుపతి, 2019 డిసెంబరు 10: టిటిడి స్థానికాలయాల్లో డిసెంబరు 11వ తేదీ బుధవారం కార్తీక దీపోత్సవం జరుగనుంది. ఇందుకోసం అన్ని ఆలయాల్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి.
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో బుధవారం కార్తీక దీపోత్సవం ఘనంగా జరుగనుంది. ఇందులో భాగంగా ఉదయం అమ్మవారి ఉత్సవర్లను శుక్రవారపు తోటకు వేంచేపు చేసి 8.30 నుండి 10 గంటల వరకు అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి 7 గంటల వరకు కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో దీపాలు వెలిగిస్తారు.
శ్రీ కోదండరామాలయంలో
తిరుపతిలోని శ్రీ కోదండరామాలయంలో సాయంత్రం 5.30 నుండి దీపాలు వెలిగిస్తారు. సాయంత్రం 6 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలోని శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి సన్నిధి నుండి ఆలయ మర్యాదలతో పడి, కార్తీకదీపం, నూతన వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ కోదండరామాలయానికి తీసుకొస్తారు. ఆ తరువాత స్వామివారికి కార్తీక దీపోత్సవ ఆస్థానం నిర్వహిస్తారు.
శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో..
తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయంలో ఉదయం 7 గంటలకు శ్రీ గోవిందరాజస్వామివారు కపిలతీర్థానికి వేంచేపు చేస్తారు. ఉదయం 10 గంటలకు తిరిగి ఆలయానికి చేరుకుంటారు. సాయంత్రం 5 నుండి 7 గంటల వరకు శ్రీ పుండరీకవళ్లి అమ్మవారి ఆలయం నుండి కార్తీక దీపం, వస్త్రాలను ఊరేగింపుగా శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయానికి తీసుకెళతారు. ఈ సందర్భంగా దీపాలు వెలిగిస్తారు. అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీగోవిందరాజస్వామివారికి ఆస్థానం నిర్వహిస్తారు.
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో ..
కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు కార్తీక దీపోత్సవం వైభవంగా నిర్వహిస్తారు. అనంతరం స్వామి, అమ్మవార్లు ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు.
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో..
నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో సాయంత్రం 6.00 గంటలకు కార్తీక దీపోత్సవం నిర్వహిస్తారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లు తిరుచ్చిపై ఆలయ నాలుగుమాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షిస్తారు.
టి.టి.డి ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.