తితిదే ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి: తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తితిదే ఉద్యోగులు సమాజానికి ఆదర్శంగా నిలవాలి: తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, జూన్ 29, 2013: తిరుమల తిరుపతి దేవస్థానంలో విధులు నిర్వహిస్తున్న ఉద్యోగులు ఆధ్యాత్మిక జీవనశైలిని అలవరచుకుని సమాజానికి ఆదర్శప్రాయంగా నిలవాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆకాంక్షించారు. తితిదే కేంద్రీయ వైద్యశాలలో ఎంఎన్‌ఓగా పనిచేసి శనివారం ఉద్యోగ విరమణ చేసిన శ్రీ తాటిపర్తి దాసు వీడ్కోలు సభకు ఈవో ముఖ్య అతిథిగా విచ్చేశారు.
తితిదే పరిపాలనా భవనంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో ఈవో ప్రసంగిస్తూ చిన్న ఉద్యోగిగా జీవితం ప్రారంభించిన దాసు ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో చొరవ చూపి అందరి ఆదరాభిమానాలు చూరగొన్నారని పేర్కొన్నారు. స్వామివారి సన్నిధిలో పనిచేస్తున్న ఉద్యోగులందరూ సమానమేనని, చిన్న, పెద్ద తేడా లేదని ఆయన వివరించారు. భక్తులకు ఎవరు ఎక్కువగా సేవ చేస్తారో వారే స్వామివారికి ప్రీతిపాత్రులన్నారు. ఉద్యోగ జీవితంలో ఉదాత్తంగా వ్యవహరించి నిష్కలంకంగా రిటైరైన వారిపై స్వామివారి కటాక్షం తప్పక ఉంటుందన్నారు. ఉద్యోగ విరమణ తరువాత ఆత్మసంతృప్తినిచ్చే పనులు చేసేందుకు వీలు కలుగుతుందని, ఆలాంటి పనుల్లో నిమగ్నమవ్వాలని దాసుకు సూచించారు. ఉద్యోగుల వీడ్కోలు సభలు ప్రతి నెలాఖరులో ఇలాగే నిర్వహించడం ముదావహమని, దాన్ని కొనసాగించాలని ఈవో కోరారు.
అనంతరం దాసును శాలువ, జ్ఞాపిక, శ్రీవారి ప్రసాదాలతో ఈవో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో తితిదే అధికార ప్రముఖులు, పెద్ద సంఖ్యలో ఉద్యోగులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.