Sri Raghunath Viswanathrao Deshpande today sworn in as the TTD Trust Board Member _ తితిదే పాలకమండలి సభ్యులుగా శ్రీ దేశ్‌పాండే ప్రమాణ స్వీకారం
తితిదే పాలకమండలి సభ్యులుగా శ్రీ దేశ్‌పాండే ప్రమాణ స్వీకారం
తిరుమల, 2012 సెప్టెంబరు 5: తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులుగా శ్రీ రఘునాధ్ విశ్వనాథరావు దేశ్‌పాండే బుధవారం ఉదయం 9.30 గంటలకు తిరుమల శ్రీవారి ఆలయంలో ప్రమాణ స్వీకారం చేశారు. తితిదే కార్యనిర్వహణాధికారి మరియు ఎక్స్ అఫిషియో సభ్యులైన శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం ఆయన చేత ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం శ్రీ దేశ్‌పాండే సకుటుంబ సపరివార సమేతంగా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వేదపండితులు వేదాశీర్వచనాలు అందించారు. తిరుమల సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు తీర్థప్రసాదాలు, స్వామివారి చిత్రపటం అందజేశారు.
అనంతరం ఆలయం వెలుపల శ్రీ దేశ్‌పాండే మీడియాతో మాట్లాడుతూ భక్తుల సేవే పరమావధిగా ఆలయం అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్రంతో పాటు ప్రపంచవ్యాప్తంగా శాంతి సౌభాగ్యాలు వెల్లివిరియాలని శ్రీవారిని ప్రార్థించినట్టు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ మునిరత్నంరెడ్డి, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.