తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌  సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల


తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌  సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదల

తిరుపతి, మే 03, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో 2012, నవంబరు 10వ తేదీన రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన 30వ సనాతన ధార్మిక విజ్ఞాన పరీక్షల ఫలితాలు విడుదలయ్యాయి. 6, 7 తరగతుల విద్యార్థులకు ధర్మపరిచయం, 8, 9, 10వ తరగతుల విద్యార్థులకు ధర్మప్రవేశిక పేర్లతో ఈ పరీక్షలు నిర్వహించారు. ఒక్కో విభాగంలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులకు రాష్ట్రస్థాయి ర్యాంకులు వరించాయి.

ధర్మపరిచయం విభాగంలో రాష్ట్రస్థాయిలో కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన నెహ్రూ హైస్కూల్‌ ఏడో తరగతి విద్యార్థిని వై.సాయి దివ్య మొదటి ర్యాంకు, అదిలాబాద్‌ జిల్లా అసిఫాబాద్‌కు చెందిన ఏ.పి సాంఘిక సంక్షేమ పాఠశాల ఆరో తరగతి విద్యార్థిని జె.శకుంతల రెండో ర్యాంకు, తూర్పుగోదావరి జిల్లా ఇంజరానికి చెందిన విజ్‌డమ్‌ పబ్లిక్‌ స్కూల్‌కు చెందిన ఆరో తరగతి విద్యార్థి టి.వెంకట వినయ్‌ మూడో ర్యాంకు సాధించారు. కడప జిల్లా పెద్దముడియం మండలం భీమగుండానికి చెందిన జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల ఆరో తరగతి విద్యార్థి టి.వెంకట సుదర్శన్‌, కృష్ణా జిల్లా కేతనకొండకు చెందిన సి.బి.ఆర్‌ స్కూల్‌ ఏడో తరగతి విద్యార్థి జె.బిపిన్‌వ్యాస్‌ కన్సొలేషన్‌ బహుమతులు కైవసం చేసుకున్నారు.

ధర్మప్రవేశిక విభాగంలో రాష్ట్రస్థాయిలో చిత్తూరు జిల్లా నారాయణవనానికి చెందిన జిల్లా పరిషత్‌ బాలికల ఉన్నత పాఠశాల పదో తరగతి విద్యార్థిని సి.రవళి మొదటి ర్యాంకు, గుంటూరు జిల్లా మణిపురానికి చెందిన శ్రీ బొర్ర నాగేశ్వరరావు మున్సిపల్‌ ఉన్నత పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థిని ఎం.శైలజ రెండో ర్యాంకు, మహబూబ్‌నగర్‌ జిల్లా కల్వకుర్తిలోని బ్రిలియంట్‌ గ్రామర్‌ హైస్కూల్‌ పదో తరగతి విద్యార్థిని ఎస్‌.రమ్యశ్రీ మూడో ర్యాంకు కైవసం చేసుకున్నారు. అదేవిధంగా అనంతపురం జిల్లా అమరపురం గ్రామంలోని శ్రీ సరస్వతి విద్యామందిర్‌ తొమ్మిదో తరగతి విద్యార్థిని పి.పవిత్ర, విజయనగరం జిల్లా బొబ్బిలికి చెందిన ఏ.పి బాలుర గురుకుల పాఠశాల తొమ్మిదో తరగతి విద్యార్థి ఎం.వాసుదేవ శివప్రసాద్‌ కన్సొలేషన్‌ బహుమతులు సాధించారు.
ధర్మపరిచయం, ధర్మప్రవేశిక విభాగాల్లో జిల్లాల వారీగా మొదటి ఐదు స్థానాల్లో నిలిచిన విద్యార్థుల వివరాలను దీనికి జతపరచడమైనది. ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థిని విద్యార్థులకు శుభప్రదం శిక్షణ తరగతుల ముగింపు సమావేశంలో ఆయా ప్రాంతాల్లో బహుమతులు ప్రదానం చేస్తారు.

రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి బంగారు పతకంతో పాటు రూ.4 వేలు నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి బంగారు పతకంతో పాటు రూ.3 వేలు నగదు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి బంగారు పతకంతోపాటు రూ.2 వేలు నగదు బహుమతులు అందజేయనున్నారు. కన్సొలేషన్‌ బహుమతులు సాధించిన ఇద్దరికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకం, రూ.వెయ్యి చొప్పున నగదు అందించనున్నారు.

జిల్లాస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకంతో పాటు రూ.వెయ్యి నగదు, ద్వితీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకంతో పాటు రూ.750/- నగదు, తృతీయ స్థానంలో నిలిచిన వారికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకంతోపాటు రూ.500/- నగదు బహుమతులు అందజేయనున్నారు. కన్సొలేషన్‌ బహుమతులు సాధించిన ఇద్దరికి ఐదు గ్రాముల శ్రీవారి వెండి పతకం, రూ.400/- చొప్పున నగదు అందించనున్నారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.