ARRANGEMENTS FOR VARALAKSHMI VRATAM REVIEWED _ తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి • జేఈఓ శ్రీ వీరబ్రహ్మం
తిరుచానూరులో వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తి • జేఈఓ శ్రీ వీరబ్రహ్మం
తిరుపతి, 2024 ఆగస్టు 13: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఆగస్టు 16న శుక్రవారం జరుగనున్న వరలక్ష్మీ వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాయని జేఈవో శ్రీ వీరబ్రహ్మం చెప్పారు. తిరుచానూరులోని ఆస్థాన మండపంలో జేఈవో వరలక్ష్మీ వ్రతంపై అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, అన్ని విభాగాల సమన్వయంతో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని జేఈఓ అధికారులను ఆదేశించారు.
ఇందుకోసం రంగురంగుల విద్యుత్ దీపాలు, వివిధ రకాల పుష్పాలతో ఆస్థాన మండపాన్ని సర్వాంగ సుందరంగా ముస్తాబు చేయాలన్నారు. ఉత్సవ శోభ ఉట్టిపడేలా ఆస్థానమండపం, ఆలయ పరిసరాల్లో శోభాయమానంగా రంగవల్లులు తీర్చిదిద్దాలన్నారు. అమ్మవారి దర్శనానికి విశేషంగా భక్తులు విచ్చేసే అవకాశం ఉండడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఈ వ్రతాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేస్తుందని చెప్పారు.
ఆస్థానమండపంలో శుక్రవారం ఉదయం 10 నుంచి 12 గంటల వరకు వరలక్ష్మీవ్రతం నిర్వహించనున్నట్లు తెలిపారు. అనంతరం సాయంత్రం 6 గంటలకు శ్రీపద్మావతి అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ మాడ వీధులలో ఊరేగి భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు తెలియజేశారు.
ఈ సమావేశంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ గోవింద రాజన్, ఏఈఓ శ్రీ రమేష్, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.