తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఘనంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
తిరుపతి, 2020 జనవరి 28: తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 1న రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకొని మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి ఉదయం 6.30 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం చేపట్టారు. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుద్ధి చేశారు. అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం కల్పించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి ఝాన్సీరాణి, ఏఈవో శ్రీ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.
ఫిబ్రవరి 1న రథసప్తమి
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో ఫిబ్రవరి 1న శనివారం రథసప్తమి సందర్భంగా ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంతో వాహనసేవలు ప్రారంభమవుతాయి. అప్పటినుండి మధ్యాహ్నం 2 గంటల వరకు అమ్మవారు హంస, అశ్వ, గరుడ, చిన్నశేష వాహనాలపై ఊరేగనున్నారు. సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంటల వరకు చంద్రప్రభ, గజ వాహనాలను అధిష్టించి అమ్మవారు దర్శనమిస్తారు.
రథసప్తమి కారణంగా ఫిబ్రవరి 1న ఆలయంలో కల్యాణోత్సవం, సామవేద పుష్పాంజలి, సహస్రదీపాలంకరణ సేవలతోపాటు సాయంత్రం బ్రేక్ దర్శనాన్ని రద్దు చేయడమైనది.
శ్రీ సూర్యనారాయణస్వామివారి ఆలయంలో
తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి అనుబంధంగా ఉన్న శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6 నుండి 7 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనభాగ్యం కల్పిస్తారు.
తితిదే ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.