DEEPA NRITYAM KRISHNA TULABHARAM _ తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కళాబృందాల కోలాహలం
TIRUPATI, 12 NOVEMBER 2023: The drum beats, rhythmic steps on the one hand the epic mythos dramas on the other hand enthralls devotees and art lovers.
TTD has organised colourful devotional cultural programmes to enthrall devotees and denizens during the ongoing annual Karthika Brahmotsavams.
On Sunday evening in front of Simha Vahanam, Deepa Nrityam, Kerala Drums, Srinivasa Kalyanam with other art forms mesmerized the devotees.
While the mythological drama of Sri Krishna Tulabharam by Surabhi artists in Mahati, the melodious rendition of Annamacharya Sankeertans by Dr Balakrishna Prasad and Smt Bullemma in Astana Mandapam at Tiruchanoor, programs at Shilparamam and Ramachandra Pushkarini allured devotees.
ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మోత్సవాల్లో కళాబృందాల కోలాహలం
తిరుపతి, 2023 నవంబరు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల్లో వాహనసేవలతోపాటు పలు వేదికలపై నిర్వహిస్తున్న ధార్మిక, సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. టీటీడీ హిందూ ధార్మిక ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలను ఏర్పాటుచేశారు. ఇందులో భాగంగా మూడో రోజు ఆదివారం నిర్వహించిన కార్యక్రమాల వివరాలిలా ఉన్నాయి.
సింహ వాహనసేవలో…
బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం రాత్రి సింహ వాహన సేవలో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి విచ్చేసిన కళాకారులు చక్కటి కళారూపాలను ప్రదర్శించారు. ఎస్వీ సంగీత, నృత్య కళాశాల విద్యార్థులు అష్టలక్ష్మీ వైభవం నృత్యరూపకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు. చెన్నైకి చెందిన నృత్యగిరి పాఠశాల కళాకారులు దీప నృత్య హారతి, గాయత్రి మంగళ హారతి నృత్యాన్ని చక్కగా ప్రదర్శించారు.
బెంగళూరుకు చెందిన నాట్యేశ్వర నృత్యశాలకు చెందిన కళాకారులు బొమ్మల నృత్యం, నటనం ఇన్స్టిట్యూట్ ఆఫ్ డాన్స్ కళాకారులు దీపాలతో భరతనాట్యం, నాట్యాంకుర పర్ఫార్మింగ్ ఆర్ట్స్ కళాకారులు శ్రీనివాస కల్యాణం నృత్యరూపకాన్ని ఆకట్టుకునేలా ప్రదర్శించారు.
తమిళనాడుకు చెందిన భరతకళా అకాడమీ ట్రస్ట్ కళాకారులు డప్పుల వాయిద్యం, జానపద నృత్యం, కొమ్ము కోయ నృత్యంతో అలరించారు. తిరుపతికి చెందిన కవిత బృందం దీపనృత్యాన్ని చూడచక్కగా ప్రదర్శించారు. వీటితోపాటు కోలాటాలు, తప్పెటగుళ్లు, కేరళ డ్రమ్స్ తదితర కళారూపాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకున్నాయి.
తిరుచానూరులోని ఆస్థానమండపంలో…
తిరుచానూరులోని ఆస్థానమండపంలో ఉదయం మంగళధ్వని, వేద పారాయణం నిర్వహించారు. అనంతరం హైదరాబాద్ కు చెందిన శ్రీ అప్పన్ కందాడై లక్ష్మణమూర్తి స్వామి భక్తామృతం ధార్మికోపన్యాసం, సేలానికి చెందిన శ్రీ మెట్టూరు బ్రదర్స్ భక్తి సంగీతం వినిపించారు. మధ్యాహ్నం తిరుపతికి చెందిన శ్రీమతి విజయకుమారి బృందం హరికథ, సాయంత్రం టీటీడీ ఆస్థాన విద్వాంసులు శ్రీ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారిణి శ్రీమతి బుల్లెమ్మ బృందం అన్నమయ్య విన్నపాలతోపాటు ఊంజల్‌సేవలో సంకీర్తనలను ఆలపించారు.
ఇతర వేదికలపై..
తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు సురభి కళాకారులు శ్రీకృష్ణతులాభారం నాటకాన్ని అద్భుతంగా ప్రదర్శించారు.
అన్నమాచార్య కళామందిరంలో సాయంత్రం 6.30 నుండి 8.30 గంటల వరకు తిరుపతికి చెందిన శ్రీ హేమ ప్రకాష్, శ్రీనివాస కుమార్ బృందం భక్తిసంగీతాన్ని చక్కగా వినిపించారు.
రామచంద్ర పుష్కరిణి వద్ద సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల వరకు తిరుపతికి చెందిన వాయునందన్ బ్రదర్స్ బృందం భక్తిసంగీతం ఆలపించారు.
తిరుచానూరు రోడ్డులోని శిల్పారామంలో సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు విజయవాడకు చెందిన శ్రీనివాసులు బృందం నృత్య కార్యక్రమం ఆకట్టుకునేలా సాగింది.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.