GRAND VARALAKSHMI VRATAM HELD _ అష్టలక్ష్మీ మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
ASTALAKSHMI MANDAPAM STEALS THE HEARTS
TENS OF THOUSANDS OF DEVOTEES WATCH SVBC LIVE
TIRUPATI, 16 AUGUST 2024: Vara Maha Lakshmi Vratam was held with utmost religious fervour in Tiruchanoor on Friday.
The Astana Mandapam was decorated specially for the mega religious event showcasing Asta Lakshmi Vaibhavam.
After Viswaksena Aradhana, Punyahavachanam, Kalasa Sthapana, Aradhana, Anga Puja, Sahasra Namarchana, Astottara Satanamavali, Grandhi Puja was performed.
Later Varalakshmi Vrata Mahatya Katha was rendered by Sri Maniikantha Swamy while Sri Babu Swamy recited the Mantras.
The entire event was telecasted live on SVBC between 10am and 12noon for the sake of global devotees.
Golden Saree
Meanwhile, the presiding deity of Sri Padmavati Ammavaru blessed Her devotees draped in Golden Saree inside the Sanctum Sanctorum.
Local MLA Sri Pulivarti Nani, EO Sri J Syamala Rao, JEOs Smt Goutami, Sri Veerabrahmam, SE2 Sri Jagadeeshwar Reddy, VGO Sri Nanda Kishore, DyEO Sri Govindarajan and others officials, devotees participated in the event.
ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
అష్టలక్ష్మీ మండపంలో శాస్త్రోక్తంగా వరలక్ష్మీ వ్రతం
తిరుపతి, 2024 ఆగష్టు 16: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయ ఆస్థాన మండపంలో శుక్రవారం వరలక్ష్మీ వ్రతం వైభవంగా జరిగింది. వరలక్ష్మీ వ్రతం సందర్భంగా వేకువజామున అమ్మవారిని సుప్రభాతంతో మేల్కొలిపి సహస్రనామార్చన, నిత్యార్చన, మూలవర్లకు, ఉత్సవర్లకు అభిషేకం నిర్వహించారు. ఈ పర్వదినాన అమ్మవారు బంగారుచీరతో విశేష అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు.
అనంతరం శ్రీ పద్మావతీ అమ్మవారి ఉత్సవమూర్తిని ఆస్థాన మండపానికి వేంచేపు చేసి పద్మపీఠంపై ఆశీనులను చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యాహవచనం, కలశస్థాపన, అమ్మవారి ఆరాధన, అంగపూజ, లక్ష్మీ సహస్రనామార్చన, అష్టోతర శత నామావళి నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారిని రోజా, చామంతి, మల్లె, సంపంగి, తులసి, పన్నీరు ఆకు, మరువము, తామరపూలు, వృక్షి వంటి సాంప్రదాయ పుష్పలతో అమ్మవారిని ఆరాధించారు.
ఈ సందర్భంగా అమ్మవారిని 9 గ్రంథులతో(నూలుపోగు) అలంకరించారు. ఒక్కో గ్రంథిని ఒక్కో దేవతకు గుర్తుగా ఆరాధించారు.
భవిష్యోత్తర పురాణంలో వ్యాస భగవానుడు వరలక్ష్మీ వ్రతం పూజావిధానాన్ని, మహత్యాన్ని తెలియజేశారని పాంచరాత్ర ఆగమ సలహాదారు శ్రీ మణికంఠ స్వామి తెలిపారు. పూర్వం శంకరుడు పార్వతిదేవికి ఈ వరలక్ష్మీ వ్రతం విశిష్ఠత, అచరించవలసిన విధానాన్ని తెలియచేసినట్లు పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు. త్రేతాయుగంలో కుండలినీ నగరంలో నివసించిన చారుమతి అనే భక్తురాలు వరలక్ష్మీ నోము ఆచరించి పొందిన ఫలప్రదాన్ని ఈ సందర్భంగా వివరించారు. సాక్షాత్తు శ్రీ మహాలక్ష్మి ప్రీతితో అవతరించిన తిరుచానూరులో వరలక్ష్మీవ్రతంలో పాల్గొన్న మహిళలకు సత్సంతానం, దీర్ఘమాంగల్యసౌఖ్యం, సిరిసంపదలు, ఆరోగ్యం, కుటుంబసౌఖ్యం వంటి ఎన్నో మహాఫలాలు కలుగుతాయని పురాణాల ద్వారా తెలుస్తోందన్నారు.
తరువాత 12 రకాల వివిధ నైవేద్యాలను అమ్మవారికి నివేదించారు. అనంతరం మహా మంగళ హరతితో వరలక్ష్మీ వ్రతం ముగిసింది.
ఈ సందర్భంగా టిటిడి ఈవో శ్రీ జె.శ్యామల రావు మీడియాతో మాట్లాడుతూ, శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో వరలక్ష్మీ వ్రతాన్ని అత్యంత వైభవంగా నిర్వహించినట్లు చెప్పారు. మహిళలు పెద్ద సంఖ్యలో వ్రతంలో పాల్గొన్నట్లు తెలిపారు. వరాలు ప్రసాదించే అమ్మవారు కావడంవల్ల వరలక్ష్మీ వ్రతం అని పిలుస్తారని అన్నారు. ఈ వ్రతం ఆచరిస్తే అష్టలక్ష్ములను ఆరాధించిన ఫలితం లభిస్తుందని భక్తుల విశ్వాసమన్నారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రత్యేక క్యూలైన్లు, అన్నప్రసాదాలు ఇతర ఏర్పాట్లు చేశామన్నారు. సాయంత్రం 6 గంటలకు స్వర్ణ రథంపై అమ్మవారు భక్తులను కటాక్షిస్తారని తెలిపారు.
భక్తులను విశేషంగా అకట్టుకున్న వ్రత మండపం
టిటిడి ఉద్యానవన విభాగం ఆధ్యర్యంలో ఆస్థాన మండపంలో ఏర్పాటు చేసిన వ్రత మండపం భక్తులను విశేషంగా అకట్టుకుంది. 15 మంది సిబ్బంది, 2 టన్నుల సంప్రదాయ పుష్పాలు, పది రకాల 20 వేల కట్ ఫ్లవర్స్ తో మూడు రోజుల పాటు శ్రమించి అమ్మవారి ఆలయం, ఆస్థానమండపం, వ్రత మండపాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు.
ఇందులో ద్రాక్ష, బత్తాయి, పైనాపిల్, మొక్కజొన్న వంటి ఫలాలు, వివిధ సంప్రదాయ పుష్పాలతో వ్రత మండపాన్ని అద్భుతంగా రూపొందించారు. మండపం పై భాగంలో గజలక్ష్మీ అమ్మవారు, కింది భాగంలో రెండు వైపుల ఐరావతాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఆస్థాన మండపాన్ని అష్టలక్ష్మిమూర్తులతో, రోజాలు, తామరపూలు లాంటి రంగురంగుల పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. చెన్నైకి చెందిన దాతల విరాళంతో పుష్పాలంకరణ చేపట్టామని ఉద్యానవన విభాగం డెప్యూటీ డైరెక్టర్ శ్రీ శ్రీనివాసులు తెలిపారు.
భక్తులందరూ వ్రతాన్ని వీక్షించేందుకు వీలుగా ఆస్థాన మండపంలో 1, పుష్కరిణి వద్ద 1, వాహన మండపం వద్ద 1, ఫ్రైడే గార్డెన్స్ 1, తొలప్ప గార్డెన్ 1 కలిపి 5 ఎల్ఇడి స్క్రీన్లు ఏర్పాటు చేశారు.
స్వర్ణరథోత్పవం
వరలక్ష్మీ వ్రతం సందర్భంగా సాయంత్రం 6 గంటలకు అమ్మవారు స్వర్ణరథంపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షించనున్నారు.
ఈ కార్యక్రమంలో చంద్రగిరి ఎం.ఎల్.ఏ శ్రీ పులివర్తి నాని, జేఈవోలు శ్రీమతి గౌతమి, శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈఓ శ్రీ గోవింద రాజన్, ఎస్ ఇ -2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి,
విజివో శ్రీ నంద కిషోర్, ఏఈఓ శ్రీ రమేష్, ఆలయ అర్చకులు శ్రీ బాబుస్వామి, సూపరింటెండెంట్ శ్రీమతి శ్రీవాణి, టెంపుల్ ఇన్స్పెక్టర్లు శ్రీ గణేష్, శ్రీ సుభాష్, ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.