తిరుపతిలో డిశెంబర్‌ 16న తొలిసారిగా ”త్రియోగ ప్రక్రియ” పై సదస్సు

తిరుపతిలో డిశెంబర్‌ 16న తొలిసారిగా ”త్రియోగ ప్రక్రియ” పై సదస్సు

తిరుపతి, 2010 డిశెంబర్‌-14: తితిదే విద్యావిభాగం ఆధ్వర్యంలో తొలిసారిగా ప్రఖ్యాత అంతర్జాతీయ యోగా గురువులు, స్వామినీ కాళీజీ గారిచే ”త్రియోగ” పై అవగాహన సదస్సును ఈ నెల 16వ తారీఖున తిరుపతిలోని త్యాగరాజ మండపంలో ఉదయం 10.30 గంటల నుండి నిర్వహించనున్నారు.

స్వామినీ కాళీజీ యోగ విద్యలు ”త్రియోగ” పద్ధతిని కనిపెట్టడమే కాకుండా ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా 31 దేశాల్లో ఈ యోగ సాధన వైశిష్ట్యం పై సదస్సులు, శిక్షణా తరగతులు, అవగాహనా కార్యక్రమాలు గత 30 ఏళ్ళుగా నిర్వహిస్తూ ఉన్నారు.  యోగా విద్యలో ఆమె ప్రాణాయామ – ఆసన ప్రక్రియలతో పాటు, 1000కి పైగా హస్త ముద్రికలను కనిపెట్టి కుండలినిని జాగృతం చేయడంలో విశేష కీర్తిని గడించారు.

మాతా మహాలక్ష్మీ, శ్రీ గణపతి సచ్చిదానంద స్వామి ప్రియ శిష్యురాలైన స్వామినీ కాళీజీ, పూజ్య గురువులచే ”విశ్వబంధు” బిరుదునుకకూడా 2006 సంవత్సరంలో పొందారు. అదేవిధంగా ఫిబ్రవరి 2010లో యోగ విద్యారంగంలో ఆమె చేస్తున్న విశేషసేవలకు గాను ప్రతిష్టాత్మక ”భారత సాంస్కృతిక రాయభారి” పురస్కారాన్ని కూడా పొందారు.

ఒక్క భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా యోగ సిద్ధితో ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న స్వామినీ కాళీజీకి ఇంగ్లాండులోని లండన్‌ మహానగరంలో ప్రతిష్టాత్మక నేషనల్‌ పోట్రైట్‌ గ్యాలరీ వారు ప్రపంచాన్ని ప్రభావితం  చేస్తున్న 208 మంది శక్తివంతమైన మహిళల్లో స్థానం కల్పించి గౌరవించింది.

ఇప్పటికే భారతదేశంతో పాటుగా అమెరికా, స్విట్జర్‌ ల్యాండ్‌, ఆస్ట్రియా, డెన్‌మార్క్‌, రష్యా, జర్మనీ, ఉక్రేన్‌ వంటి దేశాలలో కూడా స్వామినీ కళీజీ ఇప్పటికే 30కి పైగా త్రియోగా కేంద్రాలను ఏర్పాటు చేసి భారతీయ ప్రాచీన హతయోగ విద్యలో శిక్షణ ఇస్తున్నారు. అంతేగాకుండా ” క్రియావతి సిద్ధి” ద్వారా కుండలినీ శక్తిని జాగృతం చేసి యోగ సాధన చేసే వారిలో తమ శరీరంపై పూర్తి స్థాయి నియంత్రణా శక్తిని సాధించే దిశగా శిక్షణ ఇప్పిస్తున్నారు.

ప్రపంచ ప్రఖ్యాత కీర్తిగాంచిన స్వామినీ కాళీజీ త్రియోగ సాధనను తిరుపతి ప్రజలకు కూడా పరిచయం చేయడానికి తితిదే సంకల్పించింది. ఈ కార్యక్రమానికి పురప్రజలు, జిల్లా వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొని సద్వినియోగం చేసుకోవలసినదిగా కోరడమైనది.    

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.