తిరుమలలో జూన్ 3న హనుమజ్జయంతి
తిరుమలలో జూన్ 3న హనుమజ్జయంతి
తిరుమల, 31 మే 2013 : ప్రతి సంవత్సరం వైశాఖ బహుళథమినాడు తిరుమల క్షేత్రంలో ఘనంగా నిర్వహించే సాలకట్ల హనుమజ్జయంతి వేడుకలు ఈ ఏడాది జూన్ 3వ తారీఖున అత్యంత వైభవంగా జరుగనున్నాయి.
శ్రీవారి ఆలయానికి ఎదురుగాఉన్న శ్రీ బేడి ఆంజనేయస్వామి వారికి, శ్రీ వరాహస్వామి ఆలయానికి ఎదురుగా ఉన్న శ్రీ కోనేటిగట్టు ఆంజనేయస్వామి వారికి, కాలినడక బాటలో ఏడవ మైలు వద్ద ఉన్న భక్తాంజనేయ స్వామివారికి హనుమజ్జయంతినాడు విశేషంగా అభిషేక, అర్చన, నివేదనలు జరుపబడుతాయి.
తిరుమలలోని జాపాలి తీర్థంలో కూడా హనుమజ్జయంతి ఉత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది. ఆరోజు ఉదయం అభిషేక, అర్చన, ఆలంకార, నివేదనలు జరుపబడుతాయి. ఈ హనుమజ్జయంతి నాటికి భక్తులు హనుమద్దీక్షతో తిరుమల చేరుకొని జాపాలి తీర్థంలో దీక్షను విరమిస్తారు. ఈ కార్యక్రమాలలో తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొంటారు.
కాగా మొదటి ఘాట్ రోడ్డులోని ఏడవ మైలులో ఉన్న ప్రసన్న ఆంజనేయస్వామి నిలువెత్తు విగ్రహానికి ఆ రోజు సాయంత్రం 3 గంటలకు ప్రత్యేక పూజా కార్యక్రమాలను తి.తి.దే నిర్వహించనుంది. ఈ నేపథ్యంలో ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు తి.తి.దే భక్తుల సౌకర్యార్థం ఉచిత రవాణా సౌకర్యాన్ని కల్పించింది. తిరుమలలోని స్థానికులు, భక్తులు తిరుమల నుండి ఏడవ మైలుకు తిరిగి తిరుమల చేరడానికి ఈ ఉచిత రవాణా సౌకర్యాన్ని భక్తులు వినియోగించు కోవాల్సిందిగా తి.తి.దే మనవి చేస్తున్నది.
తిరుమలలో జూన్ 1న నృసింహ జయంతి 10వ రోజు ఉత్సవం
తి.తి.దే 2013-14 పంచాంగాన్ని అనుసరించి మే 23వ తారీఖున శ్రీవారి ఆలయంలో నృసింహ జయంతిని శ్రీ యోగనృసింహ స్వామివారికి ఘనంగా నిర్వహించిన విషయం విదితమే. అయితే నృసింహజయంతి నుండి 10వ నాడు తి.తి.దే ఉభయం నిర్వహించడం ఆనవాయితీ. ఈ నేపథ్యంలో జూన్ 1వ తారీఖున తిరుమలలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.
ఈ సందర్భంగా శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయనాంచారులతో కూడి ఉత్తరమాడవీధిలోని తరిగొండవారి నిలయానికి ఎదురుగా ఉన్న రాతిమండపం చెంత తి.తి.దే ఆస్థానం నిర్వహించనుంది.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.