తిరుమలలో తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత

తిరుమలలో తప్పిపోయిన బాలుడు తల్లిదండ్రులకు అప్పగింత

తిరుమల, మే 27, 2013  : తిరుమలలో తప్పిపోయిన బాలుడిని సోమవారం తితిదే విజిలెన్స్‌ అధికారులు గుర్తించి అతని కుటుంబ సభ్యులకు అప్పగించారు. కర్నూలు జిల్లాకు చెందిన వేంకటేశ్వర్లు ఆదివారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చారు. రాత్రి సమయంలో వేంకటేశ్వర్లు కుమారుడు రంజిత్‌(3) తప్పిపోయాడు. బాలుని తల్లిదండ్రులు ఈ విషయాన్ని తితిదే విజిలెన్స్‌ అధికారుల దృష్టికి తీసుకెళ్లి వెతుకులాట ప్రారంభించారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం 1.30 గంటల సమయంలో ఆర్‌టిసి బస్టాండు వద్దగల తితిదే సమాచార కేంద్రం వద్ద బాలుడిని గుర్తించారు. ఈ సందర్భంగా తితిదే సివి అండ్‌ ఎస్‌వో శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌ మాట్లాడుతూ చంటిపిల్లలతో శ్రీవారి దర్శనార్థం వచ్చే తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలని కోరారు. రద్దీ ఎక్కువగా ఉన్న రోజుల్లో తల్లిదండ్రులు తమ బిడ్డల చేయి వదలకుండా తీర్థయాత్ర పూర్తి చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.