తిరుమలలో వైభవంగా తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమలలో వైభవంగా తరిగొండ వెంగమాంబ జయంతి

తిరుమల, మే 24, 2013: శ్రీ వేంకటేశ్వరస్వామికి అపర భక్తురాలైన మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ 283వ జయంతి ఉత్సవం శుక్రవారం నాడు తిరుమల, నారాయణగిరి ఉద్యానవనంలోని పద్మావతి పరిణయ మండపంలో అత్యంత వైభవంగా జరిగింది.
ఈ సందర్భంగా శ్రీనివాసమంగాపురంలోని వశిష్టాశ్రమ పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వస్వరూపానందగిరి స్వామివారు అనుగ్రహభాషణం చేశారు. శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల బాటలో నడిచి శ్రీవారిని తన సాహిత్యంతో, యోగదీక్షతో కొలిచిన మహాయోగిని వెంగమాంబ అని ఆయన ఉద్ఘాటించారు. శ్రీవారి ఆలయంలో ఏకాంతసేవలో ”ముత్యాలహారతి” అనే విశిష్ట నిత్యకైంకర్యాన్ని వెంగమాంబ ప్రవేశపెట్టారని, ఈ సేవ నేటికీ అవిచ్ఛిన్నంగా కొనసాగుతోందని వివరించారు. ఈమె తిరుమలలో తొలిసారిగా భక్తులకు అన్నప్రసాద వితరణను ప్రారంభించారని తెలియజేశారు. తాళ్లపాక అన్నమాచార్యుల వారిని ప్రస్తుతించిన ఏకైక కవయిత్రి వెంగమాంబ కావడం విశేషమన్నారు. క్రీ.శ. 1817వ సంవత్సరంలో తిరుమల పుణ్యక్షేత్రంలో శ్రీ వేంకటేశ్వరున్ని స్మరిస్తూ వెంగమాంబ సజీవసమాధి చెందారని వెల్లడించారు. వెంగమాంబ భక్తిసందేశాన్ని భక్తలోకానికి అందించేందుకు ప్రతి ఏటా ఆమె జయంతి, వర్ధంతి ఉత్సవాలను తితిదే నిర్వహిస్తోందన్నారు.
ముందుగా ఉదయం 8.00 గంటలకు శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి తిరుమల మాడవీధుల గుండా ఊరేగింపుగా నారాయణగిరి ఉద్యానవనాల్లోని పద్మావతి పరిణయ మండపానికి చేరుకున్నారు. అనంతరం తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, ఎస్వీ సంగీత, నృత్య కళాశాల కళాకారులు గోష్టిగానం నిర్వహించారు. ఇందులో అన్నమయ్య రచించిన వివిధ సంకీర్తనలను కళాకారులు రాగతాళభావయుక్తంగా ఆలపించారు. ఆ తరువాత ఉదయం 10.30 గంటలకు తిరుమలలోని తరిగొండ వెంగమాంబ బృందావనంలో తితిదే అధికారులు పుష్పాంజలి సమర్పించారు.
ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ ఉప కార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ ప్రాజెక్టు సమన్వయాధికారి ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
           
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.