తిరుమల శ్రీవారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం 

తిరుమల శ్రీవారి ఆల‌యంలో శాస్త్రోక్తంగా గోకులాష్టమి ఆస్థానం 

తిరుమల, 2020 ఆగ‌స్టు 12: తిరుమల శ్రీ‌వారి ఆల‌యంలో బుధ‌వారంనాడు శ్రీకృష్ణ జన్మాష్టమి పర్వదినాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టారు.

 ఇందులో భాగంగా శ్రీవారి ఆలయంలోని బంగారు వాకిలి చెంత సాయంత్రం 6.00 నుండి  రాత్రి 8.00 గంట‌ల వ‌ర‌కు ఉగ్ర శ్రీనివాసమూర్తి, శ్రీదేవి, భూదేవి అమ్మవార్లు, శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతంగా తిరుమంజనం, ద్వాదశ ఆరాధన జ‌రిగింది. ఈ సందర్భంగా బంగారు సర్వభూపాల వాహనంపై శ్రీకృష్ణస్వామివారిని వేంచేపు చేసి నివేదన, ప్రబంధ శాత్తుమొర, గోకులాష్టమి ఆస్థానం శాస్త్రోక్తంగా నిర్వహించారు

 కాగా, తిరుమలలో ఉట్లోత్సవాన్ని పుర‌స్క‌రించ‌కుని శ్రీ‌వారి ఆల‌యంలో గురువారం  సాయంత్రం 4 నుండి 6 గంటల వర‌కు శ్రీమలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై, శ్రీకృష్ణస్వామివారు మరో తిరుచ్చిపై ఆల‌యంలోని రంగ‌నాయ‌కుల మండ‌పానికి వేంచేపు చేసి ఆస్థానం నిర్వ‌హిస్తారు. 

 ఈ ఏడాది  కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు తిరుమలలో శ్రీకృష్ణ జన్మాష్టమి, ఉట్లోత్సవాల‌ను శ్రీ‌వారి ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు. 

ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో శ్రీ అనిల్‌కుమార్ సింఘాల్‌, అద‌న‌పు ఈవో శ్రీ ఏ.వి.ధ‌ర్మారెడ్డి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ హ‌రీంద్ర‌నాధ్‌, ఇత‌ర అధికారులు పాల్గొన్నారు. 

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.