TTD EO REVIEWS ON KARTEEKA BRAHMOTSAVAMS _ తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి : తితిదే ఇఓ శ్రీ ఎల్.వి. సుబ్రమణ్యం
తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి బ్రహ్మోత్సవాలు నిర్వహించాలి : తితిదే ఇఓ శ్రీ ఎల్.వి. సుబ్రమణ్యం
తిరుపతి, 2012 ఆగస్టు 30: తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామివారి బ్రహ్మోత్సవాల తరహాలోనే తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలను పాంచరాత్ర ఆగమోక్తంగా నిర్వహించాలని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్.వి. సుబ్రమణ్యం అధికారులను ఆదేశించారు.
గురువారం నాడు తిరుపతిలోని శ్రీ పద్మావతీ అతిధి గృహంలో ఇఓ వివిధ విభాగాధిపతులతో తొలివిడత సమీక్షా సమావేశం నిర్వహించారు. నవంబరు 10వ తేదీన ధ్వజారోహణంతో ప్రారంభమై నవంబరు 18వ తేదీన ధ్వజఅవరోహణముతో ముగియనున్న బ్రహ్మోత్సవాలకు రాజీలేని విధంగా ఏర్పాట్లు చేసి తిరుమల బ్రహ్మోత్సవాలను తలపించేలా నిర్వహించాలని ఆదేశించారు.
అమ్మవారి బ్రహ్మోత్సవాల సమయంలో గోవిందనామాల రీతిలో అమ్మవారి నామాలను కూడా భక్తులచే పలికింపచేయాలని ఆయన అన్నారు. ఈ సందర్భంగా పుస్తక ప్రదర్శన- విక్రయశాలను, ప్రాధమిక చికిత్సా కేంద్రాన్ని, ఆయుర్వేద వైద్యకేంద్రాన్ని భక్తులకు ఉపయోగకరమైన రీతిలో ఏర్పాటు చేయాలని ఆయా విభాగాధిపతులను ఆయన ఆదేశించారు.
తిరుమలలో విద్యుద్దీపాలంకారాలు ఏవిధముగానైతే భక్తులను ఆకట్టుకున్నాయో అదేరీతిలో తిరుచానూరులో ఏర్పాటు చేయాలని ఇఓ ఇంజినీరింగ్ విభాగాధికారులను ఆదేశించారు. ఇక ఫలపుష్ప ప్రదర్శన కూడా అందంగా ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. తిరుపతి, తిరుచానూరు పరిసర ప్రాంతాలు పారిశుద్దముగా వుండే విధంగా చర్యలు చేపట్టాలని ఆరోగ్యశాఖ, పంచాయితీ అధికారులకు సూచించారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.