తెలుగు సాహితీ వినీలాకాశంలో కలికితురాయి విశ్వనాథ సత్యనారాయణ :
తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తెలుగు సాహితీ వినీలాకాశంలో కలికితురాయి విశ్వనాథ సత్యనారాయణ :
తితిదే ఈవో శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం
తిరుపతి, 2012 సెప్టెంబరు 10: తెలుగు సాహితీ వినీలాకాశంలో కవిసమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ కలికితురాయి లాంటి వారని, ఆయన తెలుగు జాతికే గర్వకారణమని తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం కొనియాడారు. తితిదే అన్నమాచార్య ప్రాజెక్టు, పురాణ ఇతిహాస ప్రాజెక్టుల ఆధ్వర్యంలో సోమవారం తిరుపతిలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత శ్రీ విశ్వనాథ సత్యనారాయణ 118వ జయంతి ఉత్సవ సమావేశం జరిగింది. ఇందులో భాగంగా శ్రీమద్రామాయణ కల్పవృక్ష సాహిత్య గోష్ఠి నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ వి.కొండలరావు సంకలనం చేసిన ”విశ్వనాథ ది లిటరరీ లెజెండ్” అనే ఆంగ్ల గ్రంథాన్ని తితిదే ఈవో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో ప్రసంగిస్తూ ప్రస్తుత తరుణంలో విశ్వనాథ సత్యనారాయణపై ఆంగ్లంలో ఈ గ్రంథం రావడం ముదావహమన్నారు. ఇప్పటితరం వారు ఆయన గురించి తెలుసుకునేందుకు ఇది చాలా దోహదం చేస్తుందని తెలిపారు. ఇందులో విశ్వనాథ సత్యనారా యణపై పలువురు ప్రముఖులు రాసిన వ్యాసాలు ఉన్నాయని, వాటిలో తన తండ్రి రాసిన వ్యాసం కూడా ఉందని ఈవో పేర్కొన్నారు. ఆ విధంగా ఈ గ్రంథంతో తనకు అనుబంధం పెరిగిందన్నారు. తితిదే విద్యాసంస్థల్లోని ఉపాధ్యాయులకు, విద్యార్థులకు ఈ గ్రంథాన్ని పరిచయం చేసి విశ్వనాథ సాహిత్యంపై అవగాహన కల్పించాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ శ్రీరాముడిని మానవాళికి ఆదర్శమూర్తిగా చూపిన శ్రీమద్రామాయణ కల్పవృక్షం గ్రంథంపై శ్రీ కోదండ రామాలయంలో సాహిత్య గోష్ఠి నిర్వహించడం విశేషమన్నారు. విద్యార్థి థ నుండే తనకు విశ్వనాథ రచనలపై ఆసక్తి ఉండేదన్నారు. కొత్త తరం వారికి ఈ గ్రంథం చాలా ఉపయోగకరంగా ఉంటుందన్నారు.
అనంతరం అన్నమాచార్య ప్రాజెక్టు సంచాలకులు డాక్టర్ మేడసాని మోహన్ అధ్యక్షతన సాహిత్య గోష్ఠి నిర్వహించారు. ఇందులో ఆచార్య తుమ్మపూడి కోటేశ్వరరావు, డాక్టర్ సముద్రాల లక్ష్మణయ్య, ఆచార్య కె.జె.కృష్ణమూర్తి, వి.కొండలరావు, విశ్వనాథ సత్యనారాయణ మనవడు శ్రీ విశ్వనాథ సత్యనారాయణ, శ్రీ శ్రీనివాసాచార్యులు తదితరులు విశ్వనాథ సాహిత్యంపై ఉపస్యసించారు. సాహిత్య గోష్ఠికి డాక్టర్ ముదివేడు ప్రభాకరరావు సమన్వయకర్తగా వ్యవహరించారు. ముందుగా ఎస్వీ విశ్వవిద్యాలయం విశ్రాంతాచార్యులు ఆచార్య సి.రామయ్య ”విశ్వనాథ ది లిటరరీ లెజెండ్” గ్రంథ సమీక్ష చేశారు. అంతకుముందు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు ఎస్.మణి బృందం నిర్వహించిన అన్నమయ్య సంకీర్తనల కచేరీ ఆకట్టుకుంది.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి శ్రీ కసిరెడ్డి వెంకటరెడ్డి, అన్నమాచార్య ప్రాజెక్టు ప్రోగ్రాం కో-ఆర్డినేటర్ డాక్టర్ కె.వాణి, ఇతర అధికార ప్రముఖులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.