ANNAMAYYA’S HONEYED LYRICS PRAISE ALAMELMANGA: SMT NAGAPADMINI _ తేనెలొలికే పదాలతో అలమేల్మంగను అలరించిన అన్నమయ్య : శ్రీమతి నాగపద్మిని

Tirupati, May 04, 2026: Smt. Nagapadmini from Hyderabad said that the compositions of Sri Tallapaka Annamacharya beautifully portray the emotions of divine love with sweet devotion. The second day of literary seminars, as part of Annamayya’s 618th Jayanthi celebrations, was held at Annamacharya Kalamandiram on Monday.

Presiding over the session, she spoke on “Annamayya’s portrayal of Alamelmanga” and highlighted the depth and beauty of his sringara sankeertanas.

Dr. Amudala Murali explained Annamayya’s Advaita philosophy, while Dr. Shaik Shawali spoke on Navavidha Bhakti in the compositions of Annamayya and Surdas.

Dr. Medasani Mohan, Special Officer of Annamacharya Project, Director Smt. Latha, officials and a large number of devotees attended.

Devotional music and dance programmes were held in the evening. At Mahati Kalakshetram, music by Smt. Sushila troupe and a dance performance by Sri Padma Kalakshetra Dance Academy are scheduled.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI                                                       

తేనెలొలికే పదాలతో అలమేల్మంగను అలరించిన అన్నమయ్య : శ్రీమతి నాగపద్మిని

తిరుపతి, 2026 మే 04: శ్రీ తాళ్లపాక అన్నమాచార్యుల వర్ణనా వైచిత్రి నిరుపమానమని, ఆయన సంకీర్తనల్లో శృంగార నాయికల భావాలను మధురభక్తితో అద్భుతంగా ఆవిష్కరించారని హైదరాబాద్‌కు చెందిన శ్రీమతి నాగపద్మిని తెలిపారు. అన్నమయ్య 618వ జయంతి ఉత్సవాల్లో భాగంగా తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరంలో సోమవారం రెండవ రోజు సాహితీ సదస్సు ఘనంగా జరిగింది.

సదస్సుకు అధ్యక్షత వహించిన ఆమె “అన్నమయ్య తీర్చిన అలమేల్మంగా” అనే అంశంపై ఉపన్యసిస్తూ, అన్నమయ్య శృంగార సంకీర్తనల భావ వైశాల్యం అపారమని పేర్కొన్నారు. ఆయన కీర్తనల్లో మధురభక్తి, సాహిత్య సౌందర్యం సమన్వయంగా ప్రతిఫలిస్తుందని వివరించారు.

“పలుకు తేనెల తల్లి…”, “ఏమని పొగడుదమే…”, “అలరులు కురియగా…” వంటి సంకీర్తనల్లో అలమేల్మంగా అమ్మవారిని మాధుర్యభరితంగా వర్ణించిన తీరు విశిష్టమని తెలిపారు.

డా. ఆముదాల మురళి “అన్నమయ్య అద్వైత తత్వం”పై మాట్లాడుతూ, శరణాగతి, లోకనీతి, వేదసారాన్ని సమన్వయపరిచి అన్నమయ్య సాహిత్యం నిర్మించారని చెప్పారు. భక్తి సాహిత్యంలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు.

డా. షేక్ షావళి “అన్నమయ్య, సూరదాసుల సంకీర్తనల్లో నవవిధ భక్తి” అంశంపై మాట్లాడుతూ, భగవత్ సంకీర్తన ద్వారా మోక్షం సిద్ధిస్తుందని వివరించారు.

ఈ కార్యక్రమంలో అన్నమాచార్య ప్రాజెక్టు ప్రత్యేక అధికారి డా. మేడసాని మోహన్, సంచాలకులు శ్రీమతి లత, అధికారులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. అనంతరం సాయంత్రం గాత్ర సంగీతం, నృత్య కార్యక్రమాలు భక్తులను ఆకట్టుకున్నాయి.

మహతి కళాక్షేత్రంలో

మహతి కళాక్షేత్రంలో కూడా సాయంత్రం 6 గం.లకు అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు శ్రీమతి సుశీల బృందం భక్తి సంగీత కార్యక్రమం, రాత్రి 7 గం.లకు శ్రీ పద్మ కళాక్షేత్ర డ్యాన్స్ అకాడమీ వారి నృత్య కార్యక్రమం జరుగనుంది. 

టీటీడీ ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే జారీ చేయబడింది