దక్షిణ భారత కర్ణాటక యువ సంగీత మహాసభలపై జెఈఓ సమీక్ష
దక్షిణ భారత కర్ణాటక యువ సంగీత మహాసభలపై జెఈఓ సమీక్ష
తిరుపతి, 2012 అక్టోబరు 5: నవంబరు 23 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలో నిర్వహించనున్న దక్షిణ భారత కర్ణాటక యువ సంగీత మహాసభలపై తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి శుక్రవారం శ్రీ పద్మావతి అతిథిగృహంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా జెఈవో మాట్లాడుతూ ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన సంగీత కళాశాల విద్యార్థుల మధ్య సంగీత పోటీలు నిర్వహించి విజేతలకు బహుమతులు ప్రదానం చేస్తామని తెలిపారు. పోటీలతో పాటు సంగీత విద్యార్థులకు అవసరమైన మెళకువలు నేర్పేందుకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు వెల్లడించారు. ప్రముఖ సంగీత కళాకారులు సంగీతం ప్రయోజనంపై పరిశోధన పత్రాలు సమర్పిస్తారని, ‘వాగ్గేయకారుల జీవితాలు – సంగీతం’పై ప్రసంగాలు చేస్తారని వివరించారు. ప్రతిరోజూ ప్రఖ్యాత సంగీత కళాకారులకు సన్మానాలు చేయనున్నట్టు తెలిపారు.
ముందుగా అక్టోబరు 12వ తేదీ నుండి తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సంగీత విద్యార్థులకు ప్రాథమిక పోటీలు నిర్వహించనున్నట్టు జెఈఓ వెల్లడించారు. అక్టోబరు 12, 13, 14వ తేదీల్లో ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాల్లోని సంగీత కళాశాలల విద్యార్థులకు, అక్టోబరు 29, 30వ తేదీల్లో కేరళ రాష్ట్రంలోని సంగీత కళాశాలల విద్యార్థులకు, అక్టోబరు 31, నవంబరు 1వ తేదీల్లో కర్ణాటక రాష్ట్రంలోని సంగీత కళాశాలల విద్యార్థులకు ప్రాథమిక పోటీలు జరుగుతాయని తెలిపారు. ప్రతి రాష్ట్రం నుండి 200 మంది విద్యార్థులు పోటీలకు హాజరవుతారని వివరించారు. నవంబరు 23 నుండి 27వ తేదీ వరకు తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో ఫైనల్ పోటీలు జరుగుతాయని తెలిపారు.
యువ సంగీత మహాసభలను సమర్థవంతంగా నిర్వహించేందుకు ఆర్గనైజింగ్ కమిటీ, ప్రోగ్రాం కమిటీ, సన్మాన కమిటీ, న్యాయనిర్ణేతల కమిటీ, పబ్లిసిటీ కమిటీ, సావనీర్ కమిటీలను జెఈఓ ఏర్పాటుచేశారు.
ఈ కార్యక్రమంలో హిందూ ధర్మప్రచార పరిషత్ కార్యదర్శి ఆచార్య కసిరెడ్డి వెంకటరెడ్డి, ప్రత్యేకాధికారి శ్రీ ఎస్.రఘునాధ్, ఎస్వీ సంగీత కళాశాల ప్రిన్సిపాల్ శ్రీమతి చల్లా ప్రభావతి ఇతర అధికారులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.