దేదీప్యమానంగా ప్రారంభమైన పద్మావతీ పరిణయోత్సవాలు
దేదీప్యమానంగా ప్రారంభమైన పద్మావతీ పరిణయోత్సవాలు
తిరుమల, 19 మే – 2013 : తిరుమల నారాయణగిరి ఉద్యానవనాల్లో ప్రతి ఏటా మూడురోజుల పాటు కన్నుల పండుగగా నిర్వహించే సాలకట్ల పద్మావతీ పరిణయోత్సవాలు ఆదివారంనాడు అంగరంగ వైభవంగా ప్రారంభమైనాయి.
బుధవారం సాయంత్రం సుమారు 4.30 గం||లకు వాహనమండపం నుండి సకలాభరణ భూషితుడైన శ్రీ మలయప్ప స్వామివారు గజవాహనారూఢుడై తిరుమాడ వీధులలో ఊరేగుతూ నారాయణగిరి ఉద్యానవనాలలోని పరిణయోత్సవ మండపానికి వేంచేపు చేసారు.
మరో పల్లకిలో దేవేరులు వేంచేపు చేసారు. అనంతరం ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా పద్మావతి పరిణయోత్సవాన్ని నిర్వహించారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే ఈ మూడురోజుల పాటు ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్రదీపాలంకార సేవలను రద్దు చేసింది.
కాగా ఈ సందర్భంగా తి.తి.దే అన్నమాచార్య ప్రాజెక్టు, హెచ్.డి.పి.పి సంయుక్త ఆధ్వర్యంలో ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను భక్తుల కొరకు ఏర్పాటు చేశారు. ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని తి.తి.దే ఏర్పాటు చేసిన పందిళ్ళు, పూల అలంకారాలు అలరించగా, ఉత్సవానంతరం నిర్వహించిన బాణసంచా కార్యక్రమం భక్తజన సందోహాన్ని అబ్బుర పరచింది.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మే 24న సుప్రభాతం మరియు అభిషేకం సేవా సమయాల్లో మార్పు
ఈ నెల 24వ తారీఖున మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ జయంతోత్సవాలను పురస్కరించుకుని ఆనాడు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత సేవలైన సుప్రభాతం మరియు అభిషేకం సేవల్లో తాత్కాలిక సమయ మార్పును తితిదే నిర్దేశించింది.
ఈ ప్రకారం ఉదయం 3.00 గంటలకు నిర్వహించే సుప్రభాతం సేవను ఉదయం 2.00 గంటలకు నిర్వహించనున్న నేపధ్యంలో ఈ సేవలో పాల్గొనే గృహస్త భక్తులు వైకుంఠం-1 నందు హాజరు కావలసిన సమయాన్ని ఉదయం 1.00 గంటకు మార్చడమైనది. అదేవిధంగా ఉదయం 4.30 గంటలకు నిర్వహించే అభిషేక సేవను ఉదయం 3.30 గంటలకే నిర్వహించనున్న నేపధ్యంలో ఈ సేవలో పాల్గొనే గృహస్త భక్తులు హాజరు కావలసిన సమయాన్ని ఉదయం 2.30 గంటలుగా మార్చడమైనది.
ఈ మార్పులను గమనించి భక్తులు తితిదేకు సహకరించగలరు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.