VEDIC STUDENTS PERFORM MODEL BRAHMOTSAVAMS IN DHARMAGIRI _ ధర్మగిరి వేద పాఠశాలలో మురిపించిన ”బ్రహ్మోత్సవ” వైభవం
ధర్మగిరి వేద పాఠశాలలో మురిపించిన ”బ్రహ్మోత్సవ” వైభవం
తిరుమల, 2012 జూలై 12: తిరుమలలోని ధర్మగిరి వేద పాఠశాలలో విద్య నేర్చుతున్న విద్యార్థుల్లో సాహిత్య కౌశలంతోపాటు ప్రయోగశీలత(ప్రాక్టికల్)ను కూడా పెంచడంలో భాగంగా మాదిరి బ్రహ్మోత్సవాలను పాఠశాల యాజమాన్యం ప్రారంభించింది.
ఈ నెల 11వ తారీఖున ధ్వజావరోహణంతో ప్రారంభమైన ఈ పంచాహ్నిక బ్రహ్మోత్సవాలు ఈ నెల 15వ తారీఖున ముగియనున్నాయి. కాగా జూలై 10వ తారీఖున సాయంత్రం 6.00 గంటలకు విష్వక్సేన ఆరాధన, పుణ్యాహవచనం, సేనాపతి ఉత్సవం, అంకురార్పణం నిర్వహించారు.
కాగా 25 సంవత్సరాలుగా కీర్తిశేషులు శ్రీ ఎన్.ఏ.కె.శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలను విద్యార్థులతో క్రమం తప్పకుండా ప్రతి ఏటా నిర్వహించబడుతూ వస్తున్నాయి. ఈ ఉత్సవాల నిర్వహణ ద్వారా విద్యార్థులు పాఠ్యాంశాల పరంగా మాత్రమే గాక ప్రత్యక్షంగా కూడా ఉత్సవాల నిర్వహణ నేర్వడం విశేషం. స్వామివారి మూలవిరాట్టును పోలిన నమూనా విగ్రహాన్ని అట్టముక్కలతో, మట్టితో, సర్వాంగ సుందరంగా మలిచి యాగశాలలో ప్రతిష్ఠించారు. అదేవిధంగా గురువారం నాడు స్వామివారు విహరించే చిన్నశేష వాహనాన్ని కూడా సృజనాత్మకంగా తీర్చిదిద్ది ఊరేగించారు. మధ్యాహ్నం స్నపనతిరుమంజనం, సాయంత్రం హనుమంత వాహనసేవ నిర్వహిస్తారు.
ఈ సందర్భంగా వేదపాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ అవధాని మాట్లాడుతూ విద్యార్థుల్లో నూతనోత్సాహాన్ని నింపడంలో భాగంగా ప్రతినెలా కళ్యాణోత్సవాన్ని ప్రయోగశీలత కార్యక్రమంగా నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఈ విధంగా చేయడం వల్ల విద్యార్థుల్లో సృజనాత్మకత పెరిగి భవిష్యత్తులో ఆలయ పూజావిధానాలను ఆగమబద్ధంగా నిర్వహించేందుకు వీలవుతుందన్నారు. ప్రస్తుతం వైఖానస ఆగమ విద్యార్థులు ఈ బ్రహ్మోత్సవాలను ఆగమోక్తంగా నిర్వహిస్తున్నారని అన్నారు. నేడు దేశ విదేశాల్లో వివిధ ఆలయాల్లో సుమారు 50 మందికిపైగా తితిదే ధర్మగిరి వేద పాఠశాల విద్యార్థులు అర్చకులుగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. వీరందరికీ కార్యదకక్షులుగా ఎంతో పేరుందని ఆయన అన్నారు. అందుకు కారణం పాఠ్యాంశాల్లో ఒక భాగంగా పూజా విధానాలను నిర్వహించడమే అన్నారు. భవిష్యత్తులో వారికి ఇది ఎంతగానో సహకరిస్తుందని తెలియజేశారు.
ఈ కార్యక్రమంలో వైఖానస ఆగమ అధ్యాపకులు శ్రీ సీతారామాచార్యులు, శ్రీ రంగాచా ర్యులు, ఇతర అధ్యాపకులు, పెద్దసంఖ్యలో విద్యార్థులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.