KARVETINAGARAM ANNUAL FETE COMMENCE _ ధ్వజారోహణంతో ప్రారంభమైన కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు
ధ్వజారోహణంతో ప్రారంభమైన కార్వేటినగరం శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు
తిరుపతి/ కార్వేటినగరం, 2025, మే 19: కార్వేటినగరం శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 9.15 గం.ల నుండి 9.45 గం.ల మధ్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు.
అంతకుముందు ఉదయం 5.30 నుండి 9.00 గంటల వరకు ధ్వజప్రతిష్ఠ, రక్షాబంధనం, భేరీతాడనం, నవసంధి, బలిహారణం, తిరుమాడ వీధి ఉత్సవం సాగింది. రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలస్వామి ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ముందుగా పర్యవేక్షించి, 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారని ప్రతీతి.
ఈ రోజు రాత్రి 7 నుండి 9 గం.ల వరకు స్వామివారు పెద్ద శేష వాహనంపై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు.
స్థల పురాణం – ఆకాశరాజు కుమార్తె పద్మావతీ దేవి కలియుగ దైవం శ్రీనివాసుల పరిణయానంతరం ఆకాశరాజు స్వర్గస్థుడు కాగా, అతని కుమారుడు వసుదాసుడు సంతానహీనుడై పూర్వము తమ పూర్వులకు అర్థరాజ్యం ఇచ్చిన నారాయణరాజు మునిమనుమడైన వేంకటరాజునకు నారాయణపుర రాజ్యమును అప్పగించి తాను వేంకటాచలమున తపస్సుచేసి శ్రీనివాసుని పాదారవిందముల ప్రాప్తి పొందగోరెను. వేంకటరాజు వంశమున వేంకట పెరుమాళ్రాజు తన పరిపాలన కాలమందు ఈ కార్వేటినగర నిర్మాణమును గావించి తిరుమలలో శ్రీ వేంకటాచలపతితో కూడి పూజింపబడుచున్న శ్రీ రుక్మిణీ సత్యభామా సమేత శ్రీ వేణుగోపాలస్వామి దేవతామూర్తులను తెప్పించి శ్రీ వేఖానసులవారిచే ప్రతిష్టింపజేసెను. ఈ ఆలయ నిర్వహణను రాజుల పరిపాలనానంతరం 1936 సంవత్సరం నుండి దేవాదాయ శాఖ నిర్వహించి, తదుపతి 1989 ఏఫ్రిల్ 10న తిరుమల తిరుపతి దేవస్థానమునకు అప్పగించబడినది. ఈ ఆలయంలో స్వామివారు సంతాన వేణుగోపాలస్వామిగా ఎంతో ప్రసిద్ధి పొందినారు.
ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో శ్రీమతి బి. నాగరత్న, ఆలయ అర్చకులు శ్రీ తరణ్ కుమార్, శ్రీ గోపాలా చార్యులు, టెంపుల్ ఇన్‌స్పెక్టర్ శ్రీ జీ.సురేష్ కుమార్, పలువురు భక్తులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాల్లో ఉదయం 7.30 నుండి 9.30 గంటల వరకు, రాత్రి 7 నుండి 9 గంటల వరకు వాహన సేవలు జరుగనున్నాయి. మే 28న మధ్యాహ్నం 1.30 నుండి 3.30 గంటల వరకు పుష్పయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :
తేదీ
20-05-2025
ఉదయం – చిన్నశేష వాహనం
సాయంత్రం – హంస వాహనం
21-05-2025
ఉదయం – సింహ వాహనం
సాయంత్రం – ముత్యపుపందిరి వాహనం
22-05-2025
ఉదయం – కల్పవృక్ష వాహన
సాయంత్రం – ఆర్జిత కళ్యాణోత్సవం/ సర్వభూపాల వాహనం
23-05-2025
ఉదయం – పల్లకీపై మోహినీ అవతారం
సాయంత్రం – గరుడ వాహన సేవ
24-05-2025
ఉదయం – హనుమంత వాహనం
సాయంత్రం – సా – వసంతోత్సవం, రాత్రి – గజ వాహనం
25-05-2025
ఉదయం – సూర్యప్రభ వాహనం
సాయంత్రం – చంద్రప్రభ వాహనం
26-05-2025
ఉదయం – రథోత్సవం
సాయంత్రం – అశ్వవాహనం
27-05-2025
ఉదయం – చక్రస్నానం
సాయంత్రం – ధ్వజావరోహణం
బ్రహ్మోత్సవాల్లో భాగంగా మే 22వ తేదీ సాయంత్రం 5 నుండి 6.30 గంటల వరకు స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా జరుగనుంది. రూ.750/- చెల్లించి గృహస్తులు కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, ఒక లడ్డూ, ఒక అప్పం బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించనున్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.