DHWAJAROHANAM HELD FOR GT FETE _ శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం
TIRUPATI. 02 JUNE 2025: The annual brahmotsavams off to a religious and colourful start in the most famous and ancient temple of Sri Govindaraja Swamy in Tirupati on Monday with the ceremonious Dhwajarohanam.
The celestial flag bearing the image of Garudalwar was hoisted on the top the temple mast in the auspicious Mithuna lagnam between 7.02am and 7.20am amidst chanting of Vedic mantras as per the tenets of Vaikhanasa Agama.
Later in the morning between 10am and 11am the Snapana Tirumanjanam has been carried out to the Utsava deities.
Both the seers of Tirumala, DyEO Smt VR Shanti, AEO Sri Munikrishna Reddy and other temple staff, devotees were present.
ISSUED BY TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI
శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాలకు వైభవంగా ధ్వజారోహణం
తిరుపతి, 2025, జూన్ 02: తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు సోమవారం ఉదయం 07.02 – 07.20 గంటల మద్య మిథున లగ్నంలో వైభవంగా ప్రారంభమయ్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల గోవిందనామస్మరణ నడుమ గరుడ చిత్రంతో కూడిన ధ్వజపటాన్ని ధ్వజస్తంభంపై ప్రతిష్ఠించారు. అనంతరం శ్రీవారి ఆస్థానం ఘనంగా జరిగింది.
అంతకుముందు శ్రీగోవిందరాజస్వామివారు, ధ్వజపటం, చక్రత్తాళ్వార్, పరివార దేవతలు బంగారు తిరుచ్చిపై నాలుగు మాడ వీధుల్లో విహరించారు. ఈ ఊరేగింపు ద్వారా బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను స్వామివారు ఒకమారు ముందుగా పర్యవేక్షిస్తారని ప్రతీతి. అనంతరం అర్చకులు విష్వక్సేన ఆరాధన, వాస్తుహోమం, గరుడ లింగహోమం, గరుడ ప్రతిష్ఠ, రక్షా బంధనం చేపట్టారు. మిథున లగ్నంలో శ్రీ గోవిందరాజస్వామి వారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. ఎన్ని దానాలు చేసినా ధ్వజారోహణకార్యంలో గరుడారోహణం చేసిన పుణ్యంతో సాటిరాదని పురాణాలు చెబుతున్నాయి. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానించడం దీని లక్ష్యం. సమాజశ్రేయస్సుకు, వంశాభివృద్ధికి ధ్వజారోహణం దోహదపడుతుంది.
బ్రహ్మోత్సవాలకు టిటిడి ఏర్పాట్లు:
శ్రీ గోవిందరాజస్వామి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా టిటిడి ఏర్పాట్లు చేపట్టింది. మూలవిరాట్ తోపాటు వాహనసేవలను భక్తులు సంతృప్తిగా దర్శించుకునేందుకు వీలుగా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టారు. ప్రధానంగా జూన్ 06న గరుడ వాహనం, జూన్ 09న రథోత్సవం, జూన్ 10న చక్రస్నానం జరుగనున్నాయి. వాహనసేవల సమయంలో ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా పోలీసులతో సమన్వయం చేసుకునేలా చర్యలు చేపట్టారు. వాహనసేవలను భక్తులు తిలకించేందుకు వీలుగా రైల్వేస్టేషన్, విష్ణునివాసం, గోవిందరాజస్వామి పుష్కరిణి ప్రాంతాల్లో డిజిటల్ స్క్రీన్లు(ఎల్ఇడి)లు ఏర్పాటు చేశారు. ఆలయం, పరిసర ప్రాంతాలను విద్యుద్దీపాలు, పుష్పాలతో సుందరంగా అలంకరించారు. క్యూలైన్ల క్రమబద్ధీకరణ కోసం తగినంత మంది శ్రీవారి సేవకులను కేటాయించారు. భక్తులకు అన్నప్రసాదాలు, వాహన సేవల్లో మజ్జిగ, తాగునీరు పంపిణీకి ఏర్పాట్లు చేశారు. హిందూ ధర్మప్రచార పరిషత్ ఆధ్వర్యంలో వాహనసేవల ముందు ఆకట్టుకునేలా నిపుణులైన కళాకారులతో భజనలు, కోలాటాలు, ఇతర సాంస్క తిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు.
ఉత్సవాల్లో మొదటిరోజు కార్యక్రమాల్లో భాగంగా ఉదయం 10 నుండి 11 గంటల వరకు కల్యాణమండపంలో స్నపనతిరుమంజనం వేడుకగా జరుగనుంది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పలు రకాల పండ్లరసాలతో స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు విశేషంగా అభిషేకం చేస్తారు.
సాయంత్రం 5.30 నుండి 6 గంటల వరకు ఊంజల్ సేవ, రాత్రి 7 గంటలకు పెద్దశేష వాహన సేవ జరుగనున్నాయి. బ్రహ్మోత్సవాల్లో భాగంగా మొదటిరోజు రాత్రి 07 గంటల నుండి 9.00 గంటల వరకు పెద్దశేషవాహనంపై స్వామివారు భక్తులను అనుగ్రహించనున్నారు.
పెద్ద శేష వాహనం విశిష్టత:
పెద్ద శేషుడు ఏడుకొండలకు, ఏడులోకాలకు సంకేతంగా ఏడుపడగలు గల ఆదిశేషుడు. వాహనరూపంలో శ్రీగోవిందరాజ స్వామిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి ‘శేషశాయి’ అనే పేరును సార్థకం చేస్తున్నాడు. శ్రీవారికి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు. తనను, శేషుణ్ణీ దర్శించే భక్తుల్ని కాపాడుతానని, మీరందరూ శేషుని వలే నాకు నిత్యసేవకులుగా ఉండి సత్ఫలాలు పొందాలని ఈ వాహనసేవ ద్వారా స్వామివారు ప్రబోధిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో శ్రీశ్రీశ్రీ పెద్ద జీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్న జీయర్ స్వామి, డెప్యూటీ ఈవో శ్రీమతి వి.ఆర్.శాంతి , ఏఈవో శ్రీ కె.మునికృష్ణారెడ్డి , శ్రీవారి సేవకులు ఇతర అధికారులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది