KAISIKA DWADASI ASTHANAM ON NOV 13 _ నవంబరు 13న శ్రీ‌వారి ఆల‌యంలో కైశికద్వాదశి ఆస్థానం

TIRUMALA, 10 NOVEMBER 2024: Kaisika Dwadasi Asthanam will be observed in Tirumala on November 13.

On this day, the Ugra Srinivasa Murthy will be paraded along the four mada streets before the sunrise between 4.30am and 5.30am.

It is only on this day that the deity comes out of the temple. During other festivals and religious events, it is Sri Malayappa Swamy who blesses His devotees.

ISSUED BY THE TTD CHIEF PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

నవంబరు 13న శ్రీ‌వారి ఆల‌యంలో కైశికద్వాదశి ఆస్థానం

తిరుమల, 2024 న‌వంబ‌రు 10: నవంబరు 13వ తేదీన కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీవారి ఆలయంలో సాలకట్ల కైశిక ద్వాదశి ఆస్థానాన్ని టిటిడి ఘనంగా నిర్వహించనుంది. వేంకటతురైవార్‌, స్నపనబేరంగా పిలిచే ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా ఒక్క కైశిక ద్వాదశి రోజు మాత్రమే సూర్యోదయానికి ముందు మాడవీధులలో ఊరేగిస్తారు.

చారిత్రక వివరాలలోనికి వెళితే కైశిక ద్వాదశిని ప్రబోధనోత్సవం అని, ఉత్తానద్వాదశి అని కూడా వ్యవహరిస్తారు. వివిధ గ్రంధాల్లో పేర్కొన్న విధంగా స్థితికారుడైన శ్రీమహావిష్ణువును మేల్కొల్పే పర్వదినాన్ని కైశికద్వాదశిగా వ్యవహరిస్తారు. శ్రీమహావిష్ణువు ఆషాఢశుక్ల ఏకాదశినాడు గాఢ నిద్రలోకి వెళ్ళారు. కైశికద్వాదశినాడు ఆయనను మేల్కొల్పు చేయడం రివాజు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు స్వరూపంగా భావించే కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీవేంకటేశ్వరస్వామి కొలువైవున్న శ్రీవారి ఆలయంలో కైశికద్వాదశి మహోత్సవాన్ని ప్రతిఏటా టిటిడి ఘనంగా నిర్వహిస్తుంది.

ప్రాశ‌స్త్యం..

పురాణాల ప్ర‌కారం శ్రీ‌వైష్ణ‌వ క్షేత్రాల్లో నిర్వ‌హించే ముఖ్య‌మైన ప‌ర్వ‌దినాల్లో కైశిక‌ద్వాద‌శి ఒక‌టి. శ్రీ వ‌రాహ స్వామి కైశిక‌పురాణంలోని 82 శ్లోకాల‌తో శ్రీ భూదేవికి క‌థ‌గా చెప్పిన రోజును కైశిక ఏకాద‌శిగా పిలుస్తారు. ఈ క‌థ ఆధారంగా కైశిక ద్వాద‌శి ప్ర‌త్యేక‌త‌ను సంత‌రించుకుంది.

నంబ‌దువాన్ క‌థ‌…

కైశికద్వాదశి పురాణ నేపథ్యం విశేష ఘట్టాలతో కూడుకున్నది. శ్రీనంబదువాన్‌ (సత్యమూర్తి) అనే భక్తుడు స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించడానికి వెలుతుండగా మార్గమధ్యంలో ఒక బ్రహ్మరాక్షసుడు తారసపడి తినేస్తానన్నాడు. అందుకు నంబదువాన్‌ సమాధానంగా తాను ప్రస్తుతం శ్రీవారికి సంకీర్తనార్చన చేయడానికి వెళుతున్నానని తప్పక తిరిగివచ్చి ఆ బ్రహ్మరాక్షసుని క్షుద్బాధను తీరుస్తానని ప్రమాణం చేశాడు. అన్న ప్రకారం స్వామివారికి కైశిక రాగంలో అక్షరమాలను నివేదించి బ్రహ్మరాక్షసుని చెంతకు వచ్చాడు. భక్త నంబదువాన్‌ భక్తికి, సత్యనిరతికి ముగ్ధుడై స్వామివారు మోక్షం ప్రసాదించారు. ఈ విధంగా ఉత్తానద్వాదశికి కైశికద్వాదశి అనే నామకరణం కలిగింది.

సూర్య‌ద‌యానికి ముందే ఎందుకు?

14వ శ‌తాబ్దంలో ఉగ్రశ్రీ‌నివాస‌మూర్తి ఊరేగింపు జ‌రుగుతూ ఉండ‌గా సూర్య కిర‌ణాలు స్వామివారి విగ్ర‌హం మీద ప‌డ‌గానే భాగీ అగ్ని ప్ర‌మాదం జ‌రిగింది. అప్ప‌టి నుండి సూర్యోద‌యానికి ముందే ఊరేగింపు నిర్వ‌హిస్తున్నారు.

ఆస్థానం

ఉగ్రశ్రీనివాసమూర్తిని శ్రీదేవి భూదేవి సమేతంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుఝామున ఆలయ అర్చకులు తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అనంతరం ఆలయం లోపల ఉదయం 6 నుండి ఉదయం 7.30 గంట‌ల వరకు కైశిక ద్వాదశి ఆస్థానాన్ని పురాణ పారాయణం ద్వారా ఘనంగా నిర్వహిస్తారు. దీనితో సాలకట్ల కైశికద్వాదశి ఉత్సవం పూర్తవుతుంది.

టీటీడీ ముఖ్య‌ ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.