BRAHMOTSAVAMS IN KARVETINAGARAM FROM MAY 31 TO JUNE 08 _ నారాయణవనం, కార్వేటినగరం బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
నారాయణవనం, కార్వేటినగరం బ్రహ్మోత్సవాల పోస్టర్ల ఆవిష్కరణ
తిరుమల, మే 20, 2013: తితిదేకి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల పోస్టర్లను కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం సోమవారం తిరుమలలోని అన్నమయ్య భవనంలో ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ రెండేళ్లుగా తితిదే తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల తరహాలోనే అత్యంత వైభవంగా తిరుపతి, ఇతర ప్రాంతాల్లో వెలసిన అనుబంధ ఆలయాల్లో సైతం వార్షిక బ్రహ్మోత్సవాలను నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ప్రతిక్షేత్రంలోనూ వేంకటేశ్వరస్వామివారి వైభవాన్ని చాటడమే లక్ష్యంగా తితిదే ఈ బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తోందన్నారు. ప్రస్తుతం తిరుపతిలోని శ్రీ గోవిందరాజస్వామివారి బ్రహ్మోత్సవాల తీరును గమనిస్తే తిరుమల బ్రహ్మోత్సవాలకు సమంగా జరుగుతున్నాయన్నారు. తిరుమలలో 1950, 1960వ సంవత్సరాల్లో భక్తులకు ఇన్ని వసతులు లేవన్నారు. క్రమేణా భక్తులకు వసతి, అన్నప్రసాద సౌకర్యాలు కల్పించడంతో నేడు లక్షలాది మంది భక్తులు స్వామివారిని దర్శించుకునే అవకాశం లభించిందన్నారు.
అదేరీతిలో రెండేళ్లుగా తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయానికి భక్తుల తాకిడి అనూహ్యంగా పెరుగుతోందన్నారు. ఈ నేపథ్యంలో అక్కడ కూడా భక్తులకు తగిన సౌకర్యాలు కల్పించాల్సిన అవసరముందని వివరించారు. తిరుచానూరు సమగ్రాభివృద్ధికి స్థానికులు సహకరించాలని ఈవో కోరారు. కాగా ఈ నెల 22 నుండి 30వ తేదీ వరకు నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు, ఈ నెల 31 నుండి జూన్ 8వ తేదీ వరకు కార్వేటినగరంలోని శ్రీ వేణుగోపాలస్వామివారి బ్రహ్మోత్సవాలు, ఈ నెల 24 నుండి 26వ తేదీ వరకు తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక వసంతోత్సవాలు, ఈ నెల 23న నగరిలోని శ్రీ కరిమాణిక్యస్వామి ఆలయ పునర్నిర్మాణ మహాసంప్రోక్షణ కార్యక్రమాలు జరుగనున్నట్టు వెల్లడించారు.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుమల జెఈవో శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు, తిరుపతి జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, అదనపు ఆర్థిక సలహాదారు మరియు ముఖ్య గణాంకాధికారి శ్రీ ఓ.బాలాజీ, స్థానిక ఆలయాల డెప్యూటీ ఈవో శ్రీ భాస్కర్‌రెడ్డి, తిరుమల శ్రీవారి ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ చిన్నంగారి రమణ ఇతర అధికారులు పాల్గొన్నారు.
–
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.