న్యూఢిల్లీ శ్రీవారి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం

న్యూఢిల్లీ శ్రీవారి ఆలయంలో ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు ప్రారంభం

తిరుపతి, మే 25, 2013: న్యూఢిల్లీలోని కాలిబడి ప్రాంతంలో తితిదే నిర్మించిన శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి ఆలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం సుప్రభాతం, భగవదారాధన, అర్చన, స్వామివారికి నిత్య కైంకర్యాలు నిర్వహించారు. అనంతరం అగ్నిప్రతిష్ఠ, మహాకుంభస్థాపన, కరక కుంభస్థాపన, చక్రాబ్జ మండల రచన ద్వారతోరణ, అంతరాళ పతాక దేవతల ప్రతిష్ఠ, పర్యగ్ని కారణమూర్తి, హవానాదులు పరివార దేవతల హోమాలు చేపట్టారు. ఆ తరువాత పూర్ణాహుతి, మహామంగళ హారతి, తీర్థప్రసాదగోష్ఠి, జలాధివాసం నిర్వహించారు.
ఈ సందర్భంగా తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ ఈ పంచాహ్నిక కార్యక్రమాలు శనివారం నుండి ఘనంగా ప్రారంభమయ్యాయన్నారు. 15 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం చొరవతో ఇంతటి ప్రతిష్టాత్మకమైన ప్రాంతంలో తితిదేకి స్థలం ఇచ్చారని తెలిపారు. అప్పట్లో ఆలయ నిర్మాణానికి రూ.1.50 కోట్ల అంచనా ఉండేదని, అనంతరం దాని విలువ రూ.11 కోట్లకు పెరిగిందని వివరించారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ప్రతిబింబించేలా  ఆ వైభవాన్ని ఢిల్లీ ప్రజలకు అందించేలా ఈ ఆలయ నిర్మాణాన్ని చేపట్టినట్టు వెల్లడించారు. భక్తుల కోసం ఆలయం పక్కన నిర్మించిన ధ్యానమందిరంలో భారతీయత ఉట్టిపడేలా సాంస్కృతిక, భక్తి, ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు తెలిపారు.
ధ్యానమందిరంలో కేవలం ఆధ్యాత్మిక, సంప్రదాయ కార్యక్రమాలు మాత్రమే అనుమతిస్తామన్నారు. స్థానికుల కోరిక మేరకు భవిష్యత్తులో ఆంధ్రాభవన్‌లో ఉన్న తితిదే సమాచార కేంద్రాన్ని ఇక్కడికే తరలించే విషయమై యోచిస్తామన్నారు. ధ్యానమందిరంలోనే ఒక గదిని ఆధ్యాత్మిక గ్రంథాలయంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. మరొక గదిలో పిల్లలకు సంగీత శిక్షణ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
అనంతరం జెఈవో శ్రీ పి.వెంకట్రామిరెడ్డి మాట్లాడుతూ తిరుమల ఆలయంలో శ్రీవారికి నివేదించే అన్ని సేవలను ఇక్కడ కూడా నిర్వహిస్తామన్నారు. ఈ నెల 29, 30, 31వ తారీఖుల్లో సాయంత్రం 5.30 నుండి 6.30 గంటల వరకు ప్రఖ్యాత పండితులు శ్రీ మల్లాప్రగడ సత్యనారాయణతో శ్రీమద్‌ భాగవతం, శ్రీ వేంకటేశ్వర వైభవంపై పురాణ ప్రవచనాలు జరుగనున్నాయన్నారు. స్థానిక భక్తులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని శ్రీవారి ఆశీస్సులను పొందాలని జెఈవో కోరారు.
ఈ కార్యక్రమంలో ఎస్‌ఈ శ్రీ రామచంద్రారెడ్డి, ఈఈ శ్రీ జగన్‌మోహన్‌రెడ్డి, ఏఈఓలు శ్రీ ఆనందరాజు, శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్‌, అర్చకులు శ్రీ శ్రీనివాసాచార్యులు, వైదికులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
   
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.