BOOKS RELEASED _ పెద్దశేష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

TIRUPATI, 11 NOVEMBER 2023:TTD Chairman Sri Bhumana Karunakara Reddy has released Sri Tallapaka Padakavula Sankeeranalu book penned by Prof. Sarvottama Rao in front of Pedda Sesha Vahanam on Saturday as a part of ongoing annual Brahmotsavams at Tiruchanoor.

 

He also released Bhagavat Gita by Dr Giridhar Borein English and Sri Vidya Vilasam by Sri Parabrahma Shasty.

 

TTD JEO Sri Veerabrahmam, DyEO Sri Govindarajan, Special Officer Publications Dt Vibhishana Sharma, Sub-editor Dr Narasimhacharya were also present.

 

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

పెద్దశేష వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుపతి, 2023 నవంబరు 11: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా రెండో రోజైన శనివారం ఉదయం జరిగిన పెద్దశేష వాహన సేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి ఆవిష్కరించారు.

శ్రీ తాళ్ళపాక పదకవుల సంకీర్తనలు -ఆచార్య కె. సర్వోత్తమరావు

ఆంధ్ర వాగ్గేయకారులలో తాళ్ళపాక అన్నమయ్య పెద్దతిరుమలయ్య, చిన్న తిరుమలయ్య శ్రీవేంకటేశ్వరస్వామిని కీర్తించిన ధన్యజీవులు. వీరిలో 15వ శతాబ్దానికి చెందిన శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు పదకవితకు ఆద్యుడు. అన్నమయ్య శ్రీవారి మహిమలను, క్షేత్రాన్ని, తీర్థాలను మాత్రమే కాకుండా శ్రీవారి సేవలను సేవకులనుకూడా. కొనియాడారు. విశేషంగా వివిధ దేవతామూర్తులతో శ్రీవారికున్న అభేదాన్ని, అనుబంధాలను కూడా విశ్లేషించారు.

ఈ తాళ్ళపాక కవుల సంకీర్తనలను శృంగార, ఆధ్యాత్మిక, యోగ కీర్తనలుగా పరిశోధకులు తెలియజేశారు. తాళ్ళపాక కవులు ఈ కీర్తనలలో కళ్ళకు కట్టినట్టుగా శ్రీవారి సేవలను, కైంకర్యాలను వర్ణించి దర్శింపజేశారు. తాళ్ళపాక కవుల సంకీర్తనలలో కల్యాణోత్సవ సంకీర్తనలు, అభిషేక సంకీర్తనలు, రథోత్సవ సంకీర్తనలు, హనుమత్సంకీర్తనలు అనే నాలుగు అంశాలకు సంబంధించిన సంకీర్తనలను ఒక చోట చేర్చి, వాటికి విడివిడిగా విశ్లేషణాత్మకమైన చక్కటి పీఠికతో “శ్రీ తాళ్ళపాక పదకవుల సంకీర్తనలు” అనే పేరున టీటీడీ ద్వారా ఆచార్య కె. సర్వోత్తమరావు భక్తలోకానికి అందిస్తున్నారు.

భగవద్గీత (వివృత్తి వ్యాఖ్య) -డా|| గిరిధర్ బోరె

భగవద్గీతను తరచుగా “గీత” అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని “గీతోపనిషత్తు” అని కూడా అంటారు, భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా యోగములు బోధింపబడినవి. భగవద్గీత, మహాభారత ఇతిహాసములోని భీష్మ పర్వము 25వ అధ్యాయం మొదలు 42వ అధ్యాయం వరకు 18 అధ్యాయములు భగవద్గీతగా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంథముగా భావింపబడుతుంది. సాక్షాత్తు కృష్ణ భగవానుడు అర్జునుని ఒక నిమిత్తమాత్రునిగా చేసుకొని సకల ప్రపంచానికి బోధించిన జ్ఞానము భగవద్గీత. కనుక ఇది హిందువుల పరమ పవిత్ర గ్రంథాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయి. భగవద్గీతకు త్రిమతాచార్యులు వ్యాఖ్యానాలు వ్రాశారు. మధ్వాచార్యుల అనే పరంపరలో వచ్చిన మంత్రాలయ శ్రీరాఘవేంద్రస్వాములవారు భగవద్గీతకు ‘గీతా వివృత్తి’ వ్యాఖ్యను రాశారు. ఆ వ్యాఖ్యను బెంగళూరుకు చెందిన డా॥ గిరిధర్ బోరె ఇంగ్లీషులో అనువాదం చేసి టీటీడీ ద్వారా భక్తలోకానికి అందిస్తున్నారు.

శ్రీ విద్యా విలాసమ్ -శ్రీ కొలిచిన అద్వైత పరబ్రహ్మ శాస్త్రి

వేదాంతము యొక్క సత్యము లేదా పరమార్ధమే అద్వైతసిద్ధాంతము. ప్రణవనాదమైన ఓంకారము మరియు బీజాక్షరములు దీనిని సమర్ధిస్తాయి. వేదాంతముయొక్క ప్రణవనాదము ఓం, హ్రీం, మరియు అహం అనేవి శక్తి మరియు శివ బీజాక్షరములు, ప్రణవము యొక్క అంతము బిందువు అనగా శక్తి.

సాధకుడి సాధన ఫలించి దేవతా చేతన లభ్యమైనప్పుడు దానిని శ్రీవిద్య అంటారు. శ్రీవిద్యావిలాసము శ్రీ శంకరభగవత్పాద శిష్య ప్రణీతము. ఈ గ్రంథాన్ని శ్రీవిద్యోపాసకులు అయిన శ్రీ కొలిచిన అద్వైత పరబ్రహ్మశాస్త్రి గారు సంకలనం చేశారు. శ్రీవిద్యావిలాసంలో 7 ఉల్లాసాలు ఉన్నాయి. వీటిలో శ్రీవిద్యా ఉపాసన గురించి క్షుణ్ణంగా వివరించబడింది. బీజాక్షరాలతో, మంత్రభాగంతో హెూమవిధులతో ఆ పరదేవతను పొందే విధానాన్ని గురించి రచయిత శ్రీ కొలిచిన అద్వైత పరబ్రహ్మ శాస్త్రి చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం, ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.