‘పేరుకే శీఘ్రదర్శనం – వి.ఐ.పి.లకు ప్రత్యేకం – అమలు కాని సి.ఎం ఆదేశాలు’ అను వార్త వాస్తవ దూరం
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి.
వివరణ
(జనవరి -21, 2011)
‘పేరుకే శీఘ్రదర్శనం – వి.ఐ.పి.లకు ప్రత్యేకం – అమలు కాని సి.ఎం ఆదేశాలు’ అను వార్త వాస్తవ దూరం
జనవరి 13వ తేదిన ”వార్త” దినపత్రిక నందు ప్రచురించిన ‘పేరుకే శీఘ్రదర్శనం – వి.ఐ.పి.లకు ప్రత్యేకం – అమలు కాని సి.ఎం ఆదేశాలు’ అను వార్త ఊహాజనితం వాస్తవ దూరం.
అక్టోబరు, 21వ తేదిన తిరుమలలో ప్రారంభించిన శీఘ్రదర్శనం అశేష భక్తజనావళి ఆదరణను చూరగొన్న విషయం విథితమే. ప్రతి శని, ఆది, సోమవారాలలో శీఘ్రదర్శనం ఉదయం 4-00 గంటలకనుండి 5-00 గంటల వరకు మరల ఉదయం 7-00 గంటల నుండి సాయంత్రం 6-00 గంటల వరకు పిదప ఆలయ కార్యక్రమాల అనంతరం రాత్రి 9-00 గంటలకనుండి ఏకాంత సేవ వరకు సర్వదర్శనంతో పాటు శీఘ్రదర్శనం భక్తులను కూడా అనుమతిస్తారు.
వాస్తవానికి కేంద్ర మంత్రి వర్యులు గత శనివారము సాయంత్రం శీఘ్రదర్శన వేళలలోనే వైకుంఠం క్యూకాంప్లెక్స్ ద్వారా శ్రీవారి ఆలయంలోనికి ప్రవేశించారే తప్ప ప్రత్యేక వేళలలోకాదు. అయితే సదరు వార్తలో కేంద్రమంత్రివర్యులవారికి శీఘ్రదర్శనం పేరు చెప్పుకొని ప్రత్యేక వేళల్లో శ్రీవారి ఆలయం లోనికి పంపి దర్శనం చేయించినట్లు, వారికై నిబంధనలు సడలించినట్లు వ్రాయడం బాధాకరం.
సామాన్యభక్తులు తిరుమలలో దిగినప్పటినుండి తి.తి.దేవస్థానం వారికి ఉచిత వసతి, తిరుమలలో ఉచిత రవాణా, ఉచితంగా తలనీలాల సౌకర్యం, ఉచిత దర్శనం, ఉచిత భోజనం తదితర సౌకర్యాలన్నీ ఎన్నో ఏళ్ళుగా కల్పిస్తూ వారి మన్ననలను పొందుతున్న విషయం సదరు విలేకరికి తెలిసి కూడా ”తిరుమలలో సామాన్య భక్తుడికి పెద్దపీట ఓ అరిగిపోయిన రికార్డు” అని వ్రాయడం సోచనీయం.
మీ పత్రికలో ఇటీవలే ”అన్నదానం కోసం జోలెపడుతున్న టిటిడి” అని హేళన భావంతో వార్త ప్రచురించడం తెలిసినదే.
భగవంతుని ఆలయాలు, ధార్మిక సంస్థలు ఎంతోమంది భక్తులు, దాతలు ఇచ్చే విరాళాలతోనే అనేక భక్తి, ధార్మిక, సామాజికహిత కార్యక్రమాలను చేపడుతున్న విషయం మరచి వార్తలు వ్రాయడం బాధాకరం. ముఖ్యంగా తితిదే లాంటి గొప్ప ధార్మిక సంస్థ పై ఇటువంటి ఉద్ధేశక పూర్వ వార్తలు వ్రాయటం ద్వారా సంస్థ ప్రతిష్టకు భంగం కలగడమేగాకుండా, భక్తుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉన్నదని తెలియజేస్తున్నాము.
కనుక ఈ సమాచారాన్ని రేపటి మీ దినపత్రిక నందు వివరణగా ప్రచురించవలసిందిగా కోరుచున్నాము.
ప్రజాసంబంధాల అధికారి
తిరుమల తిరుపతి దేవస్థానములు, తిరుపతి