ఫిబ్రవరి 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

ఫిబ్రవరి 19న తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో రథసప్తమి

తిరుపతి, 2021 ఫిబ్రవరి 04: ఫిబ్రవరి 19వ తేదీన సూర్యజయంతిని పురస్కరించుకుని రథసప్తమి పర్వదినాన  తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారు ఏడు ప్రధాన వాహనాలపై ఊరేగి భక్తులను అనుగ్రహించనున్నారు. ఈ సందర్భంగా ఆలయంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.

వాహనసేవల వివరాలు

సమయం                             వాహనం

ఉ. 7.30 –  ఉ. 8.30           సూర్యప్రభ వాహనం

ఉ. 9.00 –  ఉ. 10.00    హంస వాహనం

ఉ. 10.30 – ఉ. 11.30     అశ్వ వాహనం

మ. 12.00 – మ. 1.00     గరుడ వాహనం

మ. 1.30 –  మ. 2.30      చిన్నశేష వాహనం

సా. 6.00 –  రా. 7.00             చంద్రప్రభ వాహనం

రా. 8.30 –  రా. 9.30         గజ వాహనం

కాగా సాయంత్రం 3.30 నుండి 4.30 గంటల వరకు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలోని శ్రీ కృష్ణస్వామివారి ముఖ మండపంలో అమ్మవారి ఉత్సవర్లకు స్నపనతిరుమంజనం వైభవంగా నిర్వహిస్తారు.

 ఈ సందర్భంగా అమ్మవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ల‌క్ష్మీపూజ‌, ఊంజలసేవ, బ్రేక్‌ దర్శనాలను టిటిడి రద్దు చేసింది.

తిరుచానూరులోని శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం పక్కన గల శ్రీ సూర్యనారాయణ స్వామివారి ఆలయంలో ఉదయం 6.00 నుండి 7.00 గంటల వరకు స్వామివారు అశ్వవాహనాన్ని అధిష్టించి భక్తులకు దర్శనమివ్వనున్నారు.

ఫిబ్ర‌వరి 16న  కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయంలో రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఫిబ్ర‌వరి 16వ తేదీ ఆలయంలో కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించనున్నారు. ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చాన, శుద్ధి నిర్వహించనున్నారు.

ఆనంతరం ఉదయం 6.30 నుండి 9.00 గంటల వరకు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం జరగనుంది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అని వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలీగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రమిశ్రమాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

ఈ సంద‌ర్భంగా  ఆలయంలో నిర్వహించే ఆర్జిత కల్యాణోత్సవం, ఊంజలసేవలను రద్దు చేయడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.