SRI KALYANA VENKATESWARA SWAMY GARUDA SEVA ON FEB 22 _ ఫిబ్రవరి 22న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ
ఫిబ్రవరి 22న శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి గరుడసేవ
తిరుపతి, 2025 ఫిబ్రవరి 21: శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఐదో రోజైన శనివారం రాత్రి విశేషమైన గరుడ వాహనసేవ అత్యంత వైభవంగా జరుగనుంది. రాత్రి 7 నుండి 9 గంటల వరకు తనకు ప్రీతిపాత్రమైన గరుడవాహనంపై స్వామివారు భక్తులకు దర్శనమివ్వనున్నారు.
శ్రీవారి గరుడసేవకు ఆలయంలో టీటీడీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఆలయంలో ప్రత్యేక పుష్ప, విద్యుత్ దీపాలంకరణలు పూర్తి చేశారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, పాలు, మజ్జిగ పంపిణీ చేయనున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని విజిలెన్స్, పోలీస్ విభాగాల సమన్వయంతో ట్రాఫిక్‌కు ఇబ్బందులు లేకుండా వాహనాల పార్కింగ్ తో పాటు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు.
శ్రీవారి లక్ష్మీకాసులహారం శోభాయాత్ర :
గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం నుంచి శనివారం మధ్యాహ్నం 2 గంటలకు తిరుమల శ్రీవారి లక్ష్మీహారాన్ని ఊరేగింపుగా తీసుకెళతారు.
శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు :
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామివారి ఆలయం నుంచి శనివారం ఉదయం 7 గంటలకు శ్రీ ఆండాళ్ అమ్మవారి మాలల ఊరేగింపు ప్రారంభమవుతుంది. నగర వీధుల్లో ఊరేగింపుగా ఉదయం 11 గంటలకు శ్రీనివాసమంగాపురానికి చేరుకుంటాయి.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.