బెంగుళూరులో గుడికో గోమాత ప్రారంభం
– శ్రీ వారి ఆలయంలో ప్రారంభించిన టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి
– చైర్మన్ పిలుపుతో 216 గోవుల దానానికి ముందుకొచ్చిన దాతలు
తిరుమల 13 డిసెంబరు 2020: గో సంరక్షణ కోసం టీటీడీ ప్రతిష్టాత్మకంగా అమలు చేయదలచిన గుడికో గోమాత కార్యక్రమాన్ని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి ఆదివారం సాయంత్రం బెంగుళూరు లో ప్రారంభించారు. శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయానికి ఆవు, దూడ అందించి కర్ణాటక రాష్ట్రంలో ఈ కార్యక్రమానికి శ్రీ వైవి సుబ్బారెడ్డి శ్రీకారం చుట్టారు.
ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో శ్రీ వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశంతో టీటీడీ గుడికో గోమాత కార్యక్రమం ప్రారంభించిందని చెప్పారు. దేశంలోని మఠాలు, పీఠాలు, వేద పాఠశాలలకు కూడా గోవులను అందిస్తామన్నారు. గోవును పూజిస్తే సకల దేవతలను పూజించినట్లే అన్నారు. గోవును రక్షిస్తే హిందూధర్మాన్ని రక్షించినట్లేనన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం ప్రారంభించామని, త్వరలో తమిళనాడు లో కూడా ప్రారంభిస్తామని చెప్పారు.
చైర్మన్ పిలుపుతో 216 గోవుల దానానికి ముందుకొచ్చిన దాతలు
గుడికో గోమాత కార్యక్రమం అమలు కోసం దాతలు ముందుకొచ్చి గోవులను దానం ఇవ్వాలని సభలో చైర్మన్ శ్రీ సుబ్బారెడ్డి పిలుపు నిచ్చారు. టీటీడీ కి చెందిన ఎస్వీ గోసంరక్షణ శాలకు గోవులను అప్పగించాలని కోరారు. చైర్మన్ పిలుపునకు స్పందించి పలువురు టీటీడీ స్థానిక సలహామండలి సభ్యులు, ఇతర ప్రముఖులు 216 గోవులను దానం చేయడానికి ముందుకొచ్చారు.
యతిరాజ మఠం గురూజీ శ్రీశ్రీశ్రీ నారాయణ యతిరాజ రామానుజ స్వామి, స్థానిక సలహా మండలి సభ్యులు, టీటీడీ ధర్మకర్తల మండలి ప్రత్యేక ఆహ్వానితులు శ్రీ కుపేంద్ర రెడ్డి, స్థానిక సలహా మండలి సభ్యులు శ్రీ మురళి కృష్ణ, శ్రీ భక్తవత్సల రెడ్డి, శ్రీ కృష్ణా రెడ్డి, శ్రీమతి గీతారాం, శ్రీ భాస్కర్ రెడ్డి, శ్రీ చెన్నారెడ్డి, శ్రీ జగన్నాథ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కర్ణాటకలో గోమాత కోసం దరఖాస్తు చేసిన ఆలయాలను సందర్శించి, గోమాతను వారు సంరక్షించుకోగలరో లేదో అని తనిఖీ చేయడానికి శ్రీ కుపేంద్ర రెడ్డి అధ్యక్షతన ఒక కమిటీని నియమించారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారి చే విడుదల చేయడమైనది