భగవంతుడిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు కలిగి వుండాలి 

భగవంతుడిపై అచంచలమైన భక్తివిశ్వాసాలు కలిగి వుండాలి

– తితిదే పాలకమండలి అద్యక్షులు శ్రీడి.కె.ఆదికేశవులు

తిరుపతి, జూలై-29, 2009: మనదేశం సుభిక్షంగా ఉండాలంటే ప్రతి ఒక్కరూ వారి వారి సంప్రదాయాలను గౌరవించుకుంటూ భగవంతుడిపై అచంచలమైన భక్తి విశ్వాసాలు కలిగి వుండాలని తితిదే పాలకమండలి అద్యకక్షులు శ్రీడి.కె.ఆదికేశవులు అన్నారు. బుధవారం ఉదయం స్థానిక శ్వేత నందు ఆయన 7వ బ్యాచ్‌ మత్స్య కారులకు పూజా విధానంపై శిక్షణా తరగతులను ప్రారంభించారు.

ఈ సందర్భంగా చైర్మన్‌ మాట్లాడుతూ వందల ఏండ్లుగా చక్కటి పూజాకార్యక్రమాలను అత్యంత భక్తి శ్రద్దలతో నిర్వహిస్తుండడం వలన దేవదేవుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారు విశ్వవ్యాప్తంగా కోట్లాదిమందిని ఆకర్షిస్తూ, ఆశీర్వదిస్తున్నాడని తెలిపారు. మత్స్యకారులు ఇక్కడ శిక్షణ పొంది తృప్తి చెందక, తమ ప్రాంతాలకు వెళ్ళిన తరువాత ఇక్కడ నేర్చుకున్న విషయాలను ఆచరణలో పెట్టాల్సిన అవసరం ఉందని తద్వారా మరికొంత మంది ఆకర్షితులై ఈ పూజావిదానాన్ని నేర్చుకొని సన్మార్గం వైపు ప్రయాణం చేయడానికి మీరు దోహదపడిన వారవుతారని చెప్పారు. ప్రపంచంలోనే దాదాపు 42 దేశాలలో శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవాలయాలు ఉన్నాయని, కనుక అత్యంత శక్తి వంతుడు, భక్తుల పాలిట కొంగు బంగారమైన కలియుగదైవం శ్రీనివాసుని చెంత మీరు నేర్చుకున్న ఈ విషయ పరిజ్ఞానాన్ని పదిమందికి పంచాలని ఆయన వారిని కోరారు.

ఈ సందర్భంగా శ్వేత డైరెక్టర్‌ శ్రీభూమన్‌ మాట్లాడుతూ తడ నుండి ఇచ్ఛాపురం వరకు ఇప్పటికి అనేక మత్స్యకార్ల గ్రామాల నుండి దాదాపు 350 మంది మత్స్యకారులు శ్వేతలో పూజావిధానంపై శిక్షణ పొందారని తెలిపారు.

ఈ కార్యక్రమంలో  విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల నుండి దాదాపు 50 మంది మత్స్యకారులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.