భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే – టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
భగవంతుడి దృష్టిలో మానవులంతా ఒక్కటే – టిటిడి ఛైర్మన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి
గిరిజనులకు అర్చక శిక్షణ ద్వారా హైందవ ధర్మంపై అవగాహణ – ఈవో శ్రీ కె.వి.రమణాచారి
తిరుపతి, జూన్-2, 2008: తి.తి.దే., ఆధ్వర్యంలో ‘శ్వేత’ నందు గిరిజనులకు ఇస్తున్న శిక్షణా కార్యక్రమం వెనుక ఒక తాత్త్విక ఆలోచన వున్నదని తి.తి.దే., పాలకమండలి ఛైర్మెన్ శ్రీ భూమన కరుణాకరరెడ్డి అన్నారు. సోమవారం ఉదయం స్థానిక శ్వేత నందు వారం రోజులపాటు నిర్వహించనున్న గిరిజన గొరవలులకు పూజా విధానంపై శిక్షణా తరగతులను ఆయన ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఛైర్మెన్ మాట్లాడుతూ ఈ శిక్షణ ఇవ్వడానికి తి.తి.దే.,కి ఒక లక్ష్యం వున్నదని చెప్పారు. భగవంతుడి దృష్ఠిలో కులవ్యత్యాసాలులేవు. భగవంతుడు అందరిపైన కరుణను చూపుతాడు. సమస్త జీవరాశి ఆనందంగా వుండాలనే స్వామివారు అభిలషిస్తారు అని చెబుతూ, 2000 సంవత్సరాలకు ముందే ఏర్పడిన ఈ కులవ్యవస్థకు వ్యతిరేకంగా పోరాడడానికి తి.తి.దే., మంచి కార్యక్రమాలు చేపట్టుచున్నదని ఆయన చెప్పారు.
స్వతంత్ర భారతావనిలో 1000 సంవత్సరాలు ముస్లీములు, 200 ఏళ్ళు బ్రిటీష్‌వారి పాలనకన్నా, 50 ఏళ్ళు మనవారి పాలనలోనే మతాంతీకరణలు ఎక్కువగా జరిగాయని, ఈ మతాంతీకరణల నుండి బయటపడక పోతే హైందవం ఉనికికి అది గొడ్డలిపెట్టులాంటిదని చెప్పారు. ఈ పాలకమండలి వచ్చిన తరువాత సమాజహిత కార్యక్రమాలైన దళితగోవిందం, కైశీకద్వాదశి ఉత్సవం, కల్యాణమస్తు, భక్తిచైతన్య యాత్ర, గిరిజన, మాలదాసర్లు, మత్స్యకారులకు పూజా విధానంపై శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామి వైభవాన్ని భక్తులందరికీ తెలిసేలా విశిష్ట సేవలు అందిస్తున్నామని ఆయన తెలిపారు.
తి.తి.దే., ఇ.ఓ. శ్రీ కె.వి.రమణాచారి మాట్లడుతూ తి.తి.దే., నిర్వహిస్తున్న అన్ని సామాజికహిత కార్యక్రమాలకు పాలకమండలి, అధ్యకక్షులు సహకారం ఎంతో వున్నదని, ఈ పూజావిధానంపై ఎంతోమంది పండితులు సలహాలు తీసుకొని సరియైన పద్ధతిలో వీరందరికీ శిక్షణ ఇస్తే బాగుంటుందనే ఆలోచనతో ఈ శిక్షణా కార్యక్రమం ప్రారంభించామని చెప్పారు. ఎంతో నిష్టతో భగవంతుని పూజలు చేసేవారికి, మంత్రం తోడైతే ఇంకా బాగుంటుందని, ఇది ఈ శిక్షణలో సాధ్యమౌతుందని ఆయన చెప్పారు. ప్రతి ఒక్కరు తమలోని చెడు స్వభావాల్ని దూరం చేసుకోవడమే గాక సాత్విక ఆహ్వారం, అలవాట్లను అలవరచుకోవడం మంచిదని చెప్పారు. గిరిజన గొరవలులకు నేడు ఇస్తున్న ఈ శిక్షణ విత్తనం మొలకై, మొక్కై, మహావృక్షం కాగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
రాష్ట్ర శాసనసభ షెడ్యూల్డుకులాల కమీషన్ ఛైర్మెన్ శ్రీ గంగారాం మాట్లాడుతూ మనలోని లోపాలను సవరించుకుంటూ, చెడు స్వభావాలను దూరంగా వుంచడం ద్వారా అందరి దృష్టిలో ఉత్తముడుగా వుండవచ్చునని, అదే విధంగా వ్యసనాలకు దూరంగా వుంటూ, మంచి లక్షణాలు కల్గివుండి, నేనెందుకు బ్రాహ్మణుడు కాకూడదు అని ప్రతిఒక్కరు తమకు తాము ప్రశ్నించు కోవాలని ఆయన చెప్పారు.
ఈ కార్యక్రమంలో ఎమ్.ఎల్.సి. శ్రీబాలసుబ్రమణ్యం, గిరిజన ప్రతినిధులు శ్రీతణుకు వెంకట్రామయ్య. శ్రీచిన్నఅబ్బాయిరెడ్డి, శ్వేత డైరెక్టర్ శ్రీభూమన్‌లు ప్రసంగించగా, జె.ఇ.ఓ. శ్రీఏ.వి.ధర్మారెడ్డి, ఆర్థిక సలహాదారు శ్రీమతి అనితాషా ఆకెళ్ళ, ధర్మప్రచారపరిషత్ కార్యదర్శి డా|| విజయరాఘవాచార్యులు, తూర్పుగోదావరి జిల్లాలోని 50 గ్రామాలనుండి వచ్చిన గిరిజనులు తదితరులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.