భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచితే విజయం తథ్యం : టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి 

భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచితే విజయం తథ్యం : టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి

తిరుపతి, 2023, జూలై 11: భగవంతునిపై పరిపూర్ణ విశ్వాసం ఉంచి పనులు మొదలుపెడితే తప్పక సఫలీకృతమై విజయం వరిస్తుందని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి అన్నారు. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో తిరుపతి రైల్వేస్టేషన్‌ వెనక వైపు గల మూడో సత్రం ప్రాంగణంలో మంగళవారం భజనమండళ్ల సామూహిక భజనలు కొనసాగాయి.

టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ప్రత్యేకాధికారి శ్రీ ఆనందతీర్థాచార్యులు ఆధ్వర్యంలో రాత్రి జరిగిన భజన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జేఈవో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల నుంచి 3500 మందికిపైగా భజనమండళ్ల సభ్యులు మెట్లోత్సవంలో పాల్గొనేందుకు విచ్చేయడం అభినందనీయమన్నారు. ధర్మ ప్రచారాన్ని మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు దాససాహిత్య ప్రాజెక్టు విశేషంగా కృషి చేస్తోందన్నారు. భజనమండళ్ల సభ్యులు టీటీడీ చేస్తున్న ధార్మిక కార్యక్రమాల ప్రచారకులుగా నిలవాలని ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

టీటీడీ చీఫ్ ఆడిట్ ఆఫీసర్ శ్రీ శేషశైలేంద్ర మాట్లాడుతూ భక్తుల హృదయాంతరాల్లోనే భగవంతుడు ఉన్నాడన్నారు. ప్రతి ఒక్కరూ ఈ విషయాన్ని గుర్తించాలని చెప్పారు. మనసు అచంచలమైనదని, బుద్ధితో ఆలోచిస్తే సరైన నిర్ణయాలు తీసుకోవచ్చని అన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయడమైనది.