భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతానికి తార్కాణం చిత్తూరు జిల్లా- కలెక్టరు శేషాద్రి

భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతానికి తార్కాణం చిత్తూరు జిల్లా- కలెక్టరు శేషాద్రి

తిరుపతి, మార్చి-21, 2011: విభిన్న భాషలకు, వైవిధ్య సంస్కృతులకు, వివిధ మతవిశ్వాసాలకు, ఆధ్యాత్మిక ప్రాభవానికి నిలమయమైన చిత్తూరు జిల్లా భిన్నత్వంలో ఏకత్వ సిద్ధాంతానికి నిదర్శనం అని జిల్లా కలెక్టరు శ్రీ వి.శేషాద్రి ఉద్ఘాటించారు.

తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర వేదవిశ్వవిద్యాలయం రామేశ్వర ప్రశాసనభవనంలో రెండు రోజుల పాటు నిర్వహించే చిత్తూరుజిల్లా శతాబ్ది పూర్తి వేడుకల ప్రారంభోత్సవ సాహితి సదస్సుకు ఆయన సోమవారం నాడు ముఖ్య అతిథిగా విచ్చేసినారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వంద వసంతాలు పూర్తి చేసుకొని, అన్ని రంగాలలోను విశేష కీర్తి గడించి, ప్రపంచ చిత్రపటంలోనే తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సాధించిన ఘనత ఒక చిత్తూరు జిల్లాకే దక్కిందన్నారు. 1911 సం||లో ఏప్రిల్‌ 1వ తారీఖున ఏర్పడిన చిత్తూరుజిల్లా ప్రస్తుతం వేయికి పైగా ప్రధానఆలయాలతో భాసిల్లుతున్న ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా, ఏడు అత్యున్నతమైన విశ్వవిద్యాలయాలు కల్గిన సరస్వతీనిలయంగా, సాహిత్య-రాజకీయ-సాంస్కృతిక రంగాల్లో ఎందరో మహనీయులకు జన్మనిచ్చిన పవిత్రభూమిగా, అటు కర్ణాటక ఇటు తమిళనాడు రాష్ట్రాల భాషా సంస్కృతులను కలబోసుకున్న తెలుగునాడుగా విరాజిల్లుతున్నదని అన్నారు.

భిన్నభాషాసంస్కృతులకే కాకుండా విభిన్న మతవిశ్వాసాలకు కూడా చిత్తూరుజిల్లా కేంద్రం అన్నారు. తిరుపతిలో వెలసి ఉన్న ప్రపంచ ప్రఖ్యాత హైంధవ ధార్మిక క్షేత్రం అయిన తిరుమల శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం, మదనపల్లిలోని క్రైస్తవుల ప్రార్థనా స్థలం అయిన చర్చి, కలిచెర్లలో ముస్లింల దర్గా దేశవిదేశాల నుండి ఆయా మతవిశ్వాసాలకు చెందిన భక్తులను ఆకర్షిస్తోందన్నారు. ఈ విధంగా భిన్నత్వంలో ఏకత్వానికి చిత్తూరుజిల్లా తలమానికంగా నిలిచిందన్నారు. ఇంతేకాకుండా భౌగోళిక వైవిధ్యతలో కూడా చిత్తూరుజిల్లా తనదైన స్థానాన్ని ఏర్పరచుకుందన్నారు.  తమిళనాడులోని కొన్ని గ్రామాలతో, కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలతో, కడపజిల్లాలోని కొన్ని స్థానాలతో, అన్ని కలిపి మొత్తం 15 తాలూకాలతో రూపుదిద్దుకున్న చిత్తూరుజిల్లా 1986 సం|| నాటికి 66 మండలాలతో రూపాంతరం చెందిందన్నారు.

ఇన్ని విశేషాంశాలు కల్గిన చిత్తూరు జిల్లా శతాబ్ది మహోత్సవాలు జరుపుకోవడం విశేషం అన్నారు.ఈ శతాబ్ది మహోత్సవాలను సాహితీ సదస్సుతో శ్రీవేంకటేశ్వర స్వామి వారి పాదాలచెంత వేదవిశ్వవిద్యాలయంలో ప్రారంభించడం శుభసూచకం అన్నారు.ఇదే క్రమంలో జిల్లాలోని ఇతర విశ్వవిద్యాలయంలో కూడా ఇదే తరహాలో జిల్లా వైభవచరిత్రను తెలిపే అనేక సాహితీ కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలిపారు.

ఈ కార్యక్రమానికి గౌరవ అతిథిగా విచ్చేసిన స్విమ్స్‌ డైరెక్టర్‌ డా|| వెంగమ్మ మాట్లాడుతూ  చిత్తూరుజిల్లా శల్య ఆయుర్వేద చికిత్సకు పుట్టినిల్లు అన్నారు. జిల్లాలోని పుత్తూరు,కలికిరి, ప్రాంతాలలో రోగులకు అందించే శల్య చికిత్స ప్రపంచ ప్రఖ్యాతిని పొందిందన్నారు.నేడు స్విమ్స్‌ ఆసుపత్రి వంటి విభిన్న ప్రత్యేకతలు కల్గిన చికిత్సాలయం చిత్తూరుజిల్లాలో ఉండడమే కాకుండా దేశంలోనే ఒకానొక ప్రముఖ ఆసుపత్రిగా పేరుగాంచిందన్నారు.

తమ అధ్యక్ష ఉపన్యాసంలో వేద విశ్వవిద్యాలయం కులపతి ఆచార్య శ్రీ సన్నిధానం సుదర్శన శర్మ  మాట్లాడుతూ కళ,సాంస్కృతిక, సాహిత్య,సారస్వత, ఆధ్యాత్మిక, రాజకీయ,సామాజిక, భౌగోళిక,భాషా విభిన్నతలతో కూడిన ప్రత్యేక జిల్లాగా చిత్తూరు ప్రఖ్యాతిగాంచిందన్నారు.వంద వసంతాలు జరుపుకుంటున్న చిత్తూరుజిల్లా అనేకానేక రంగాలల్లో విశేష కీర్తి గడించిందన్నారు. జిడ్డు క్రిష్ణమూర్తి, సర్వేపల్లి రాధాక్రిష్ణ, కట్టమంచి రామలింగా రెడ్డి,గౌరి పెద్ది రామసుబ్బ శర్మ వంటి అనేకానేక మంది మహనీయులు తమతమ రంగాలలో విశేషసేవలను ఈ చిత్తూరు జిల్లాలోనే చేసారన్నారు.అటువంటి ఎందరో మహనీయుల చారిత్రక పరంపర తెలిస్తే భావితరం నడవడి సుగమం అవుతుందని ఆయన అన్నారు. అందుకే తాము చిత్తూరుజిల్లా శతాబ్ది పూర్తి వేడుకల ప్రాభవాన్ని వేద,శ్రౌత,స్మార్త,ఆగమ,జ్యోతిష,సాహిత్య సదస్సుతో నిర్వహించనున్నట్లు తెలిపారు.

ఈ ఉద్ఘాటన సమావేశంలో స్థానిక ఎంపి డా||చింతామోహన్‌, విశ్వవిద్యాలయం కులసచివులు డా||మనోజ్‌ కుమార్‌ మిశ్రా, సహాయకులసచివులు శ్రీ ఉమేష్‌ భట్‌, కార్యక్రమ నిర్వాహకులు శ్రీ పి.రామకృష్ణ, వేద అధ్యాపకులు,విద్యార్థులు పాల్గొన్నారు.కాగా సోమ,మంగళ వారాలలో జరిగే ఈ సాహితీ సదస్సులో చిత్తూరుజిల్లాలో వేద సంరక్షణ, చిత్తూరుజిల్లాలో వేదపండితులు, చిత్తూరుజిల్లాలో భక్తి సాహిత్యం, వేదవాఙ్మయం, వేదసంరక్షణలో తితిదే వంటి అంశాలపై శ్రీకూచిభట్ల తారకరామ శర్మ, శ్రీగోలి వెంటసుబ్రమణ్య శర్మ, డా||సి.రంగనాథన్‌, ఆచార్య సముద్రాల లక్ష్మణయ్య, డా|| ఆర్‌. మాధవి, ఆచార్య యస్‌.సచ్చిదానం వంటి అనేక మంది సాహితీ వేత్తలు ప్రసంగించనున్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.