SRINIVASA KALYANAM AT AMARAVATI ON 14 MARCH _ మార్చి 14న అమరావతిలో శ్రీనివాస కళ్యాణం – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
మార్చి 14న అమరావతిలో శ్రీనివాస కళ్యాణం – టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు
తిరుపతి, 2025, ఫిబ్రవరి 25.: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతిలో మార్చి 14న శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నామని టిటిడి ఈవో శ్రీ జె. శ్యామల రావు తెలిపారు. టిటిడి పరిపాలనా భవనంలోని సమావేశ మందిరంలో టిటిడి అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి, జేఈవో శ్రీ వి. వీరబ్రహ్మంలతో కలసి మంగళవారం ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ, అమరావతి సమీపంలోని వెంకటపాలెంలో ఉన్న టిటిడి శ్రీవేంకటేశ్వర ఆలయం ప్రాంగణంలో వైభవంగా శ్రీనివాస కళ్యాణాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతిష్టాత్మకంగా శ్రీనివాస కళ్యాణాన్ని చేపట్టేందుకు అవసరమైన ఏర్పాట్లు గడుపులోపు పూర్తి చేసేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. రెండు వారాలు గడువు ఉండడంతో టిటిడి అధికారులు క్షేత్రస్థాయిలో శాఖల వారీగా పనులు పూర్తి చేయాలని అధికారులకు పలు సూచనలు చేశారు.
రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు హాజరుకానున్న నేపథ్యంలో అవసరమైన భద్రత, భక్తులకు క్యూలైన్లు, కల్యాణం రోజున భక్తులు వీక్షించేందుకు వీలుగా అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అమరావతి పరిసర ప్రాంతాలలో విసృతంగా ప్రచారం చేసేందుకు వీలుగా సంబంధిత జిల్లా అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు. కళా బృందాలు, ఆకట్టుకునేలా విద్యుత్, పుష్పాలంకరణలు, అన్నప్రసాదాలు పంపిణీ ఏర్పాట్లు చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో సీఈ శ్రీ సత్యనారాయణ, పలువురు డిప్యూటీ ఈవోలు, అధికారులు పాల్గొన్నారు.
టిటిడి ముఖ్య ప్రజా సంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.