మార్చి 28న సదాచారం విజయోత్సవ సభ

మార్చి 28న సదాచారం విజయోత్సవ సభ

తిరుపతి, మార్చి 26, 2013: తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌ ఆధ్వర్యంలో మార్చి 28వ తేదీన తిరుపతిలోని మహతి కళాక్షేత్రంలో సదాచారం తరగతుల విజయోత్సవ సభను ఘనంగా నిర్వహించనున్నారు.

తితిదే ఆధ్వర్యంలోని పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు గతేడాది గాంధీ జయంతి నాడు సదాచారం శిక్షణ తరగతులు ప్రారంభించారు. వారానికి ఒక తరగతి చొప్పున 52 వారాలు 52 అంశాలతో తరగతులు నిర్వహించారు. ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో శిక్షణ తరగతులు పూర్తయ్యాయి. అనంతరం ఈ తరగతుల్లో బోధించిన అంశాలపై శ్వేత భవనంలో విద్యార్థినీ విద్యార్థులకు క్విజ్‌ పోటీలు నిర్వహించారు. ఇందులో గెలుపొందిన వారికి మహతిలో జరుగనున్న సదాచారం విజయోత్సవ సభలో బహుమతులు ప్రదానం చేయనున్నారు.

మార్చి 28వ తేదీ సాయంత్రం 4.00 గంటలకు విజయోత్సవ సభ ప్రారంభం కానుంది. ఇందులో సదాచారం తరగతుల ఆవశ్యకతపై ప్రముఖులు ప్రసంగించనున్నారు. విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు పాల్గొనాలని కోరడమైనది.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.