KAT IN SRI TT _ మార్చి 29న శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

TIRUMALA, 29 MARCH 2022: The temple cleaning fete Koil Alwar Tirumanjanam will be held in Tirumala temple on Tuesday in connection with Subhakrutnama Ugadi on April 2.

The celestial fete will be observed between 6am and 11am. After the ritual, darshan commences for pilgrims.

ISSUED BY TTDs PUBLIC RELATIONS OFFICER, TIRUPATI

మార్చి 29న శ్రీవారి ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం

తిరుమల, 2022 మార్చి 28: తిరుమల శ్రీవారి ఆలయంలో ఏప్రిల్ 2న శుభ‌కృత్ నామ సంవ‌త్స‌ర ఉగాది ఆస్థానాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 29వ తేదీన మంగ‌ళ‌వారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది. సాధారణంగా సంవత్సరంలో నాలుగుసార్లు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీ. ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవాలు, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు మంగళవారం ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని నిర్వహిస్తారు.

ఉదయం 6 నుండి 11 గంటల వరకు ఆలయ శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహిస్తారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప ఆలయాలు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర అన్ని వస్తువులను నీటితో శుభ్రం చేస్తారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేస్తారు. శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయమంతటా ప్రోక్షణం చేస్తారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. మధ్యాహ్నం 12 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.