BOOKS RELEASED _ ముత్యపుపందిరి వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

Tirupati, 12 November 2023: Three spiritual books were released during Mutyapu Pandiri Vahana Seva in Tiruchanoor Brahmotsavams on Sunday.

TTD JEO Sri Veerabrahmam released Tales of Wisdom book in English penned by Prof.Sujata, Sara Sangraha Ganitam by Prof.Arunachalam, Sri Venkatanagadhipa Satakam in Hindi by Prof Venkatramana Rao on the occasion.

DyEO Sri Govindarajan, Special Officer Publications Dr Vibhishana Sharma, Sub-Editor Dr Narasimhacharyulu were also present.

ISSUED BY THE PUBLIC RELATIONS OFFICER TTDs, TIRUPATI

ముత్యపుపందిరి వాహన సేవలో ఆధ్యాత్మిక పుస్తకాల ఆవిష్కరణ

తిరుపతి, 2023 నవంబరు 12: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా మూడో రోజైన ఆదివారం ఉదయం జరిగిన ముత్యపుపందిరి వాహన సేవలో మూడు ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ జేఈవో శ్రీ వీరబ్రహ్మం ఆవిష్కరించారు.

టేల్స్ ఆఫ్ విజ్డమ్- ఆచార్య వి. సుజాత

సనాతన భారతీయ సంస్కృతికి మూలాధారాలు వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు. రామాయణ భారత పండితులకే కాక సామాన్య ప్రజానీకానికి ప్రత్యేకించి నేటి యువతకు బాలబాలికలకు భాగవతాదుల విషయాలను అందించే సంకల్పంతో వీటిలోని నీతి కథలను చక్కటి శైలిలో ఆంగ్లంలో వ్రాసి ఆచార్య వి. సుజాత గారు తి.తి.దేకు సమర్పించారు. 101 కథలతోకూడిన Tales of Wisdom అనే ఈ గ్రంథాన్ని తితిదే స్వీయ ప్రచురణగా భక్తలోకానికి అందిస్తున్నది.

సార సంగ్రహగణితం

తాత్పర్య రచన – ఆచార్య పి.వి. అరుణాచలం

ప్రాచీన భారతదేశంలో ఆర్యభట్టు, వరాహమిహిరుడు, బ్రహ్మగుప్తుడు మున్నగుపండితులు గణితశాస్త్రంతోపాటు ఖగోళ, జ్యోతిష శాస్త్రాలలో పాండిత్యాన్ని పొందినవారు. కేవల గణితశాస్త్ర పండితులు అరుదు. దక్షిణ భారతదేశంలో కర్ణాటక ప్రాంతానికి చెందిన శ్రీ మహావీరాచార్యులు కేవల గణితశాస్త్రపండితులు. వీరు 9వ శతాబ్దంలో కర్ణాటరాజ్యాన్ని పాలించిన అమోఘవర్షనృపతుంగుని ఆస్థాన గణిత విద్వాంసులు. వీరు గణిత శాస్త్రాన్ని సంస్కృతంలో గణిత సంగ్రహసారమనే పేరుతో వ్రాశారు. ఈ గ్రంథాన్ని క్రీ.శ.11వ శతాబ్దానికి చెందిన పావులూరి మల్లన తెలుగులో సారసంగ్రహగణితం పేరుతో పద్యకావ్యంగా అనువదించారు. ఈ గ్రంథాన్ని బ్రహ్మశ్రీ వేటూరి ప్రభాకర శాస్త్రిగారు పరిష్కరించారు. నేటి తరానికి కేవల పద్యం అర్థం కాదు కనుక వారికి అర్థమయ్యేరీతిలో ఆచార్య పి.వి. అరుణాచలం గారిచే తాత్పర్యాన్ని వ్రాయించి తి.తి.దే స్వీయముద్రణ చేసింది.

శ్రీ వేంకటనగాధిప శతకం హిందీ అనువాదం – ఆచార్య వై.వెంకటరమణరావ్

కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వేంకటేశ్వరస్వామివారిని ఎందరో కవివరేణ్యులు, వాగ్గేయకారులు కీర్తించి తరించారు. అటువంటి వారిలో శ్రీ మంచెల్ల కృష్ణకవి ఒకరు. వీరు శ్రీవారి వైభవాన్ని భక్తి విశేషాలను కీర్తిస్తూ శరణాగతిని కోరుతూ శ్రీ వేంకటనగాధిప శతకాన్ని రచన చేశారు. దీనిలో 112 ఉత్పల, చంపకమాల పద్యాలున్నాయి. మొదటి 15 పద్యాలలో శ్రీవారి 108 నామాలను కీర్తించిన కృష్ణకవి ఆ తరువాతి పద్యాలలో స్వామివారి దయాహృదయాన్ని కీర్తిస్తూ భక్తులను భవబంధాలనుండి విముక్తుణ్ణి చేయమని ప్రార్థించాడు. భక్తివినా ఇతరత్రా అన్నీ అశాశ్వతాలేనని భక్తులకు ప్రభోదించాడు. మంచాల కృష్ణ కవి తెలుగులో వ్రాసిన శ్రీ వేంకటనగాధిపశతకాన్ని ఆచార్య వై వెంకటరమణరావ్ గారు హిందీలో అనువదించి టీటీడీ ద్వారా భక్తలోకానికి అందిస్తున్నారు.

ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీ గోవిందరాజన్, ప్రచురణల విభాగం ప్ర‌త్యేకాధికారి డా. ఆకెళ్ల విభీషణ శర్మ, ఉపసంపాదకులు డా. నరసింహాచార్య, రచయితలు పాల్గొన్నారు.

టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.