మే 14న తిరుమలలో శ్రీ భాష్యకార్ల శాత్తుమొర
మే 14న తిరుమలలో శ్రీ భాష్యకార్ల శాత్తుమొర
తిరుమల, 09 మే – 2013 : శ్రీ వైష్ణవ భక్తాగ్రేశ్వరుడైన శ్రీరామానుజాచార్యుల ఆవిర్భావ శుభదినాన్ని పురస్కరించుకొని తిరుమలలో ఈ నెల 14వ తారీఖున శ్రీ భాష్యకార్లవారి శాత్తుమొర నిర్వహించనున్నారు.
శ్రీ వైష్ణవసిద్దాన్త నిర్దారణదురంధరుడై శ్రీభాష్యము ననుగ్రహించిన శ్రీ రామానుజాచార్యులవారు తుణ్ణీర మండలమునందు పింగళనామ సంవత్సర చైత్రశుద్ద పంచమీ గురువారం ఆర్ద్రా నక్షత్రముతో కూడిన కటక లగ్నమందు మేషమాసమున శేషాంశముచే క్రీ.శ. 1017 సంవత్సరమున అవతరించిరి. అందుచే మేషమాసమున ఆర్ద్రా నక్షత్రమందు శాత్తుమొరను నిశ్చయించి ఆ దినముతో కూడిన పదవ దినమునందు ముందుగా శ్రీ భాష్యకారులవారికి ఉత్సవములు ప్రారంభించి పదవ దినమున ఆర్ద్రా నక్షత్రమున శాత్తుమొర జరుపుతారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 5 నుండి 14 వరకు ప్రతిరోజూ ఉదయం శ్రీ భాష్యకార్ల వారిని తిరుమాడ వీధులలో ఊరేగిస్తారు. అదే విధంగా ఈ నెల 5 నుండి 23వ తారీఖు వరకు 19 రోజులపాటు ఉభయదార్లు భాష్యకారులవారికి ఉభయాలను వంతులవారిగా సమర్పిస్తారు.
ఈ ఉత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 14వ తారీఖున శ్రీవారి ఆలయంలో నిర్వహించే వసంతోత్సవాన్ని తి.తి.దే రద్దు చేసింది. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీ మలయప్పస్వామివారు తన ఉభయనాంచారులతో కూడి భాష్యకారులవారు వెంటరాగా తిరుమాడ వీధులలో ఊరేగుతారు. అనంతరం ఆలయంలోనికి వేంచేపు చేస్తారు. ఇక్కడ భాష్యకారులవారి సన్నిధి చెంత శాత్తుమొర నిర్వహిస్తారు. శాత్తుమొరలో జీయంగార్లు, ఏకాంగులు, శ్రీ వైష్ణవస్వాములు, ఆచార్య పురుషులు పాల్గొంటారు. దీనితో ఈ ఉత్సవం ఘనంగా ముగుస్తుంది.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.