మే 15 నుండి విరామదర్శనం భక్తులకు తప్పనిసరి సంప్రదాయ దుస్తుల డ్రస్‌కోడ్ అమలు
మే 15 నుండి విరామదర్శనం భక్తులకు తప్పనిసరి సంప్రదాయ దుస్తుల డ్రస్‌కోడ్ అమలు
తిరుమల, 08 మే – 2013 : అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీవేంకటేశ్వరస్వామివారి దర్శనార్థం దేశవిదేశాల నుండి తిరుమలకు విచ్చేసే భక్తులు విరామ దర్శనం సమయంలో కూడా తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులనే ధరించాలని తి.తి.దే నిర్ణయించింది. ఈ సంప్రదాయ దుస్తుల డ్రస్‌కోడ్ విధానం ఈ నెల 15వ తారీఖునుండి అమలులోనికి రానున్నది.
ప్రపంచంలో ప్రఖ్యాత హైంధవ ధార్మికసంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానం హైంధవ సనాతనధర్మ విలువలును కాపాడటమే లక్ష్యంగా ఎన్నో కార్యక్రమాలను రూపొందిస్తున్నది. ఇందులో భాగంగా శ్రీవారి దర్శనానికి నిత్యం విచ్చేసే లక్షలాదిమంది భక్తులకు సంప్రదాయ దుస్తుల డ్రస్‌కోడ్ అమలు చేయాలని అనేకమంది భక్తులు తి.తి.దేకు వివిధ సందర్భాలలో సూచిస్తున్నారు. ఈ మేరకు తి.తి.దే ఆర్జితసేవల్లో పాల్గొనే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులను ధరించి పాల్గొనాలనే నిబంధన ఇప్పటికే అమలు చేసింది. అయితే థలవారిగా తిరుమలకు విచ్చేసే భక్తులందరికీ సంప్రదాయ దుస్తుల ధారణను అమలు చేయాలనే యోచనలో తి.తి.దే ఉన్నది.
అందులో భాగంగా ఇకపై ఈ నెల 15వ తేది నుండి ప్రముఖుల విరామ దర్శనం సమయంలో శ్రీవారిని దర్శించుకొనే భక్తులు తప్పనిసరిగా భారతీయ సంప్రదాయ దుస్తుల్లోనే శ్రీవారిని దర్శించుకోవాల్సి ఉంటుంది. పురష భక్తులైతే పంచ – ధోవతి లేదా కుర్త – పైజామా మహిళా భక్తులకు చీర – రవిక, లంగా – ఓణి, పైన చున్నీతో పంజాబీ డ్రస్ లేదా చుడిదార్ ధరించవలసి ఉంటుంది. దీనికి సంబంధించి చిత్రాలతోటి వివరాలతో తిరుమలలోని మాతృశ్రీ తరిగొండ వెంగమాంబ అన్నప్రసాద భవనం, ముళ్ళకుంట, అన్ని ఉప విచారణ కేంద్రాలలో, అన్ని గదులలోను భక్తుల సమాచారార్థం ఉంచడం జరుగుతుంది. ఈ మార్పులను గమనించి భక్తులు తి.తి.దేకు సహకరించగలరు.
ఐ.టి బాటలో ధర్మగిరి వేదపాఠశాల
దాదాపు 130 ఏళ్ళకుపైగా చరిత్ర కలిగిన తిరుమల ధర్మగిరి వేదపాఠశాల ఆధునీకరణ దిశగా నడుస్తున్నది. నిత్యం వేదఘోషలో నినదించే ధర్మగిరులలో వేదాల నేర్చుకొంటున్న వందలాదిమంది వేద విద్యార్థులకు అందిస్తున్న సౌకర్యాలన్నీ కంప్యూటీకరించడానికి వేద పాఠశాల ప్రిన్సిపాల్ శ్రీ కె.ఎస్.ఎస్. అవధాని చొరవతో సహాయ కార్యనిర్వహణాధికారి శ్రీ పాపయ్య నాయుడు విశేషంగా కృషిచేస్తున్నారు.
ఇందులో భాగంగా విద్యార్థులకు విద్య, వసతి సౌకర్యాలు, హాజరుపట్టిక, పరీక్షలు, ప్రగతి మున్నగు వివరాలన్నింటినీ ఉచితంగా కంప్యూటీకరించడానికి చెన్నైకు చెందిన ‘క్విబస్ టెక్నాలజీ’ వారు ఉచితంగా సాప్ట్‌వేర్ రూపొందించి సేవలందించనున్నారు. ఈ మేరకు ఆ కంపెనీకి చెందిన ప్రతినిధులు శ్రీ అరవింద, శ్రీ నాగరాజలు ఈ సేవలందిస్తున్నారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.