మే 22 నుండి 30వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

మే 22 నుండి 30వ తేదీ వరకు నారాయణవనం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు

తిరుపతి, మే 13, 2013: తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న నారాయణవనంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు మే 22 నుండి 30వ తేదీ వరకు వైభవంగా జరుగనున్నాయి. మే 21వ తేదీ సాయంత్రం అంకురార్పణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.
 
తేదీ ఉదయం సాయంత్రం
 
22-05-13(బుధవారం) ధ్వజారోహణం(కర్కాటకలగ్నం) పెద్దశేష వాహనం
23-05-13(గురువారం) చిన్నశేష వాహనం హంస వాహనం
24-05-13(శుక్రవారం) సింహ వాహనం   ముత్యపుపందిరి వాహనం 25-05-13(శనివారం) కల్పవృక్ష వాహనం   సర్వభూపాల వాహనం
26-05-13(ఆదివారం) మోహినీ అవతారం గరుడ వాహనం
27-05-13(సోమవారం) హనుమంత వాహనం గజ వాహనం
28-05-13(మంగళవారం) సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
29-05-13(బుధవారం) రథోత్సవం కల్యాణోత్సవం, అశ్వవాహనం
30-05-13(గురువారం) చక్రస్నానం ధ్వజావరోహణం
 
బ్రహ్మోత్సవాల్లో రథోత్సవం రోజైన మే 29వ తేదీ రాత్రి 8.00 నుండి 9.30 గంటల వరకు  స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రూ.500/- చెల్లించి గృహస్తులు(ఇద్దరు) ఈ కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, తిరుచానూరు అమ్మవారి నాలుగు కుంకుమ ప్యాకెట్లు, నాలుగు కంకణాలు, నాలుగు పసుపు దారాలు, ఒక లడ్డూ, ఒక వడ బహుమానంగా అందజేస్తారు.
ఈ సందర్భంగా తితిదే హిందూ ధర్మప్రచార పరిషత్‌, దాససాహిత్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతిరోజూ ఆధ్యాత్మిక, భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు, భజనలు, కోలాటాలు నిర్వహించ నున్నారు. అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో సాయంత్రం 6.00 నుండి 7.30 గంటల వరకు ఊంజల్‌ సేవ సమయంలో అన్నమయ్య సంకీర్తనల ఆలాపన, ప్రతిరోజూ రాత్రి 9.00 గంటలకు  హరికథ కార్యక్రమాలు నిర్వహించనున్నారు.
శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు, శ్రీ పద్మావతి అమ్మవారు కొలువైన దివ్యక్షేత్రం నారాయణ వనం. తిరుమల క్షేత్రానికి 34 కి.మీ దూరంలో తిరుపతి-మద్రాసు మార్గంలో పుత్తూరుకు 5 కి.మీ దూరంలో నారాయణవనం ఉంది. దీని అసలు పేరు నారాయణపురం. శ్రీనివాసుడు వేటకు వచ్చి నారాయణవనం ఉద్యానవనంలో చెలికత్తెలతో విహరిస్తున్న పద్మావతిని చూసి మోహించి వివాహం చేసుకున్నట్టు పురాణాల ద్వారా తెలుస్తోంది. కాబట్టి దీనికి నారాయణపురం అని పేరొచ్చింది. సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు పద్మావతిని వివాహమాడేందుకు వరునిగా మారినందువల్ల ఈ క్షేత్రం నారాయణవరంగా పేరొందింది. ఇక్కడి ఆలయాన్ని ఆకాశరాజు నిర్మించినట్టు భక్తుల విశ్వాసం. ఇక్కడ అర్చామూర్తి శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారు తూర్పుముఖంగా ఉన్నారు. వక్ష స్థలంలో లక్ష్మీదేవి విరాజిల్లుతోంది. స్వామివారు నడుముకు థావతార వడ్డాణం, భుజంపై సాలగ్రామమాల, చక్రం, ఖడ్గం ధరించి ఉన్నారు. చేతిలో వేటఖడ్గం ఉంది. ఆలయ ప్రధాన రాజగోపురాన్ని శ్రీకృష్ణదేవరాయలు నిర్మించినట్టు తెలుస్తోంది. ఇది ఏడు అంతస్తులతో 150 అడుగుల ఎత్తున శోభాయమానంగా ఉంది.  
 
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.