మే 31 నుండి జూన్ 2వ తేది వరకు శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
మే 31 నుండి జూన్ 2వ తేది వరకు శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామివారి వసంతోత్సవాలు
తిరుపతి, 2010 మే 16: శ్రీనివాస మంగాపురంలోని శ్రీకల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో మే నెల 31వ తేది నుండి జూన్ 2వ తేది వరకు మూడు రోజుల పాటు వార్షిక వసంతోత్సవాలు కన్నులపండుగగా జరుగుతాయి. ఈ సందర్భంగా ఆలయంలో స్వామివారికి నిత్యం జరిగే ఆర్జిత సేవలైన కల్యాణోత్సవము, బ్రహ్మోత్సవములను మూడు రోజులపాటు రద్దుచేసారు. అష్టోత్తర సతకలషాభిషేకం సేవను జూన్ 2వ తేదిన రద్దుచేసారు.
ఈ మూడు రోజులపాటు జరిగే ఈ వసంతోత్సవములలో మొదటి రెండు రోజులు స్వామివారి ఉత్సవర్లకు మధ్యాహ్నం 3 గంటల నుండి 4.30 గంటల వరకు స్నపనతిరుమంజనం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. 6 గంటలకు ఊంజలసేవ జరుగుతుంది. అనంతరం స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులను అనుగ్రహిస్తారు. మూడవ రోజు స్వామివారితో పాటు సత్యభామ, రుక్మిణి సమేత శ్రీకృష్ణస్వామివారు, శ్రీ సీతాలక్ష్మణసమేత శ్రీరాములవారులకు స్నపనతిరుమంజనం భక్తి శ్రద్దలతో నిర్వహిస్తారు. 6 గంటలకు ఊంజలసేవ జరుగుతుంది. అనంతరం ఉత్సవమూర్తులు మాడవీధులలో విహరిస్తూ భక్తుల కర్పూరనీరాజనాలను అందుకొంటారు.
ఆర్జితంగా జరిగే ఈ వసంతోత్సవంలో రూ.516/- చెల్లించి ఇద్దరు పాల్గొనవచ్చును. వీరికి స్వామి వారి ఉత్తరీయం, రవిక, అన్నప్రసాదాలను అందజేస్తారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.