మే19 నుండి 21 వరకు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం
మే19 నుండి 21 వరకు తిరుమలలో పద్మావతి పరిణయోత్సవం
తిరుమల, 18 మే – 2013 : పద్మావతి శ్రీనివాసుల పరిణయోత్సవ మహోత్సవాన్ని పురస్కరించుకొని ఈ నెల 19 నుండి 21 వరకు మూడు రోజులపాటు తిరుమలలో శ్రీ పద్మావతి పరిణయోత్సవం అంగరంగ వైభవంగా జరుగనుంది.
ఈ సందర్భంగా ఈ మూడురోజులు పాటు శ్రీవారి ఆలయంలో నిర్వహించే ఆర్జిత బ్రహ్మోత్సవం, వసంతోత్సవం, సహస్ర దీపాలంకార సేవలను తి.తి.దే రద్దు చేసింది.
కాగా శ్రీ మలయప్ప స్వామివారు తొలిరోజు గజవాహనంపైన, రెండవరోజు అశ్వవాహనంపైన, చివరిరోజు గరుడవాహనంపైన ఊరేగగా, శ్రీదేవి, భూదేవి బంగారు పల్లకిపై వేంచేపు చేస్తారు. అనంతరం నారాయణగిరి ఉద్యానవనాల్లో పరిణయోత్సవ కార్యక్రమాన్ని కన్నుల పండుగగా ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహిస్తారు. పద్మావతీ పరిణయోత్సవాన్ని పురస్కరించుకొని తితిదే ఉద్యానశాఖ నారాయణగిరి ఉద్యానవనంలో పరిణయ మండపాన్ని అత్యంత అద్భుతంగా ఫలపుష్పాలతో, చెఱకు, అరటి, మామిడి తోరనాలతో అందంగా అలంకరించింది.
ఈ సందర్భంగా హిందూధర్మప్రచారపరిషత్ మరియు అన్నమాచార్య ప్రాజెక్టు వారి ఆధ్వర్యంలో సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.
ఈ కార్యక్రమంలో తి.తి.దే ఉన్నతాధి కారులు పాల్గొంటారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.