రథసప్తమి వాహనసేవల్లో తి.తి.దే పుస్తకావిష్కరణలు 

రథసప్తమి వాహనసేవల్లో తి.తి.దే పుస్తకావిష్కరణలు
 
తొలిసారిగా తెలుగులో భారత భాగవత కృతులు బ్రైలీ లిపిలో ఆవిష్కరణ

తిరుమల, 17 ఫిబ్రవరి – 2013: సూర్యజయంతిని పురస్కరించుకొని ఆదివారంనాడు తిరుమలలో రథసప్తమి వాహనసేవలు కన్నులపండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఒకొక్క వాహనం ప్రారంభంలో అనేక తి.తి.దే ముద్రిత పుస్తకాలను  పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరి బాపిరాజు, తి.తి.దే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్‌.వి సుబ్రహ్మణ్యం సంయుక్తంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా 12 పుస్తకాలు ఆవిష్కరించబడడం విశేషం.
 
అందులో ముఖ్యంగా తొలిసారిగా ఉషశ్రీ తెలుగులో సరళీకరించిన భారతభాగవత కృతులను అంధుల సౌకర్యార్థం బ్రైలీ లిపిలో వెలుగులోకి తీసుకురావడం విశేషం. వీటిని చిన్నశేషవాహన సందర్భంగా ఆవిష్కరించారు.
 
కాగా హైదరాబాదుకు చెందిన దేవానార్‌ ఫౌండేషన్‌ వ్యస్థాపకులు పద్మశ్రీ సాయిబాబాగౌడ్‌ ప్రత్యక్షంగా బ్రైలీ లిపిలో భారత భాగవతాలను విరచించారు. ఈ కృతులను తి.తి.దే సహకారంతో తయారుచేయించినట్లు తి.తి.దే ముఖ్య సంపాదకులు శ్రీ శైలకుమార్‌ తెలిపారు. కాగా మరో మూడు నెలల వ్యవధిలో రామాయణాన్ని కూడా బ్రైలీ లిపిలో వెలుగులోనికి తీసుకురానున్నట్లు తెలిపారు. ఈ పుస్తకాలు అంధ విద్యార్థులకు ఎంతగానో ఉపకరించనున్నాయని అన్నారు.
 
తి.తి.దే ఎడిటర్‌ ఇన్‌ చీఫ్‌ శ్రీ రవ్వా శ్రీహరిగారి నేతృత్వంలో మరో 9 పుస్తకాలు వాహనాల సందర్భంగా ఆవిష్కరించబడ్డాయి. వాటి వివరాలు.
 
చిన్నశేషవాహన సందర్భంగా
1. భక్తతిన్నెడు రచయిత- శ్రీలగడపాటి భాస్కర్‌
అపార శివ భక్తుడైన భక్తకన్నప్ప జీవిత విశేషాలతో కూడిన పుస్తక సంకలనం.
2. ఆళ్వారుల పాశురాలలో వేంకటేశ్వర వైభవం రచయిత- ప్రొ|| ఎస్‌.జయప్రకాశ్‌
ఆళ్వారులు తమ పాశురాలలో స్వామివారి వైభవాన్ని కీర్తంచుట.
 
గరుడవాహన సందర్భంగా
 
3. శ్రీ వేంకటేశ్వరస్వామివారి కైంకర్యాలు రచయిత- శ్రీరామకృష్ణ దీక్షితులు
కలియుగ వైకుంఠంగా భాసిల్లే శ్రీ వేంకటాద్రిపై అఖిలాండకోటి బ్రహ్మాండనాయకుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి అవతరించి నిత్యమూ భక్తులకు దర్శనమిస్తూ వారిని తరింపజేస్తున్నాడు. పిలిస్తే పలికే ప్రత్యక్ష దైవమూ, కోరిన వరాలరాయుడైన శ్రీ వేంకటేశ్వరస్వామి వెలసిన ఈ క్షేత్రంలోని దివ్యమంగళ విగ్రహం, స్వామి పుష్కరిణి, పవిత్ర తీర్థాలు, స్వామికి అతి వైభవంగా జరిగే నిత్య కైంకర్యాలు, స్వామి బ్రహ్మోత్సవాలు మొదలైన విశేషాలు భక్తులకు తెలియజేయాలనే సంకల్పంతో తి.తి.దే శ్రీవారి ప్రధానార్చకులలో ఒకరైన శ్రీమాన్‌ అర్చకరామకృష్ణ దీక్షితులుగారిచే రచింపజేసి ”శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు” అన్న ఈ గ్రంథాన్ని భక్తులకు అందజేస్తున్నది. ”తిరుమల క్షేత్రదర్శిని” సీరీస్‌లో భాగంగా అందిస్తున్న ఈ ”శ్రీ వేంకటేశ్వరస్వామి కైంకర్యాలు” గ్రంథం వైఖానస ఆగమం ప్రకారం శ్రీ స్వామివారికి జరిగే కైంకర్యాలను కూర్చి వివరంగా తెలుసుకోనేందుకు ఈ అవకాశాన్ని కల్పిస్తున్నది.
 
4. అథర్వ వేదసంహిత మంత్ర పాఠ సహితం 8వ సంపుటం రచయిత- డా||చిఱ్ఱావూరి శ్రీరామశర్మ
 
అథర్వవేదం లౌకిక శాంతి, పుష్టి, రక్షణ, వైద్యాది అనేక విషయాలతో కూడి ఉంటుంది. ముఖ్యంగా నక్షత్రశాంతులు, శనైశ్చన గ్రహశాంతులు వంటి అనేక శాంతి క్రియా మంత్రాలతో పాటు అనేక కోరికలను తీర్చగలిగే హోమ ప్రక్రియలను, శాంతిహోమ విధానాలను తెలియజేసే మంత్రాలు ఉన్నాయి. ప్రముఖ వేదవేత్తలు మంత్రానుష్ఠానపరులు బ్రహ్మశ్రీ చిఱ్ఱావూరి శ్రీరామశర్మగారు ఈ బృహుత్‌ వేద గ్రంధాన్ని సరళమైన తెలుగు భాషలో వ్యాఖ్యానించారు. వేదపరిరక్షణలో భాగంగా తి.తి.దే వేద వ్యాఖ్యాన గ్రంథాల్ని ఉద్ధరించి ప్రచురిస్తున్నది. అందులో ఇది అథర్వవేదానికి సంబంధించిన తెలుగు వ్యాఖ్యాన గ్రంథం.
 
హనుమంతవాహన సందర్భంగా
 
5. శ్రీ తిరుమల తిరుపతి వేంకటేశ్వర దివ్య వైభవం రచయిత- తిరువాయిపాటి రాఘవయ్య తమిళ శ్రీవైష్ణవ వాజ్మయ ప్రపంచంలో ప్రసిద్ధులైనవారు ఆళ్వారులు, వీరు పండ్రెండుమంది. పరమ భక్తులైన ఈ ఆళ్వారులు ఇతర వైష్ణవక్షేత్రాల్లోని దేవతలతో పాటు ప్రముఖంగా తిరుమల దివ్యక్షేత్రంలోని శ్రీ వేంకటేశ్వరస్వామిని చాల గొప్పగా కీర్తించారు. అందులో పెరియాళ్వారు, కులశేఖరుడు, తిరుమంగై ఆళ్వారు, నమ్మాళ్వారు ఈ నల్వురు ఆళ్వార్లు కీర్తించిన తిరువేంగడ వైభవంతో పాటు శ్రీనివాసుని తత్వాన్ని సంక్షిప్తంగా వివరించిన గ్రంథం.
 
6. వళ్ళలార్‌ జ్యోతిరామలింగస్వామి రచయిత- ప్రొ|| అరుణాచలం తిరుమల తిరుపతి దేవస్థానం ”బ్రహ్మమొక్కటే” శీర్షికక్రింద ఒక గ్రంథమాలను ప్రచురించింది. ఆ వరుసలో ప్రకటింపబడిన గ్రంథం ఇది. 19వ శతాబ్దంలో చిదంబరక్షేత్రం దగ్గరలో జన్మించిన ఆధ్యాత్మిక యోగి శ్రీరామలింగస్వామి. ఆయన జీవితాన్ని సంక్షింప్తంగా తెలిపే గ్రంథం ఇది.
 
7. ఆర్షపుత్ర శతకం రచయిత- డా|| టి.వి.నారాయణ
తేటతెలుగుల్లో, ఆటవెలది పద్యాల్లో వెలసిన వేమన శతకాన్ని చదువనివారుగాని, కనీసం అందులోని ఒకపదమైనా నోటికిరానివారుగానీ తెలుగుదేశంలోనే ఉండరని చెప్పడం ఆ శతకానికి గల బహుళవ్యాప్తిని సూచిస్తుంది. ”విశ్వదాభిరామ వినుర వేమ” అనే మకుటంతో ఒప్పారే వేమనశతక రచనకు ఆకర్షితులై, భారతదేశంలోని ప్రజలంతా ఆర్షపుత్రులే అనగా ఋషిపుత్రులే అని భావించిన డా|| టి.వి.నారాయణగారు ”అవధరింపుమయ్య! ఆర్షపుత్ర” అనే మకుటంతో ఆటవెలదుల్లో రచించిన శతకమే ఆర్షపుత్త్ర శతకం. డా||నారాయణగారు తమ గురువులొద్ద నేర్చుకున్నవీ, స్వాధ్యాయంవల్ల జీర్ణించుకొన్నవీ, అనుభవంచేత అర్థంచేసుకొని జీవితంలో ఆచరించుటకు యత్నం చేసినవీ అయిన సత్యాలను ఈ శతకంలో పొందుపరచారు.
 
కల్పవృక్షవాహన సందర్భంగా
 
8. అథర్వవేద సంహిత 9,10 మంత్రపాఠసహితం రచయిత- డా|| చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ అపౌరుషేయాలైన వేదాలను సామాన్య ప్రజానీకానికి సైతం అర్థమయ్యేలా తి.తి.దే, వేదాలకు ఆంధ్రానువాద కార్యక్రమాన్ని చేపట్టింది. అథర్వవేదాన్ని అనువదింపజేసే కార్యక్రమంలో భాగంగా ప్రస్తుతం అథర్వవేదసంహిత 20వ కాండలోని 9,10 సంపుటములు ఆవిష్కరింపచేస్తున్నది. ఈ గ్రంధాలను ప్రముఖ వేదవిధ్వాంసులు డా||చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మగారు సరళమైన భాషలో ఆంధ్రీకరించారు. 9వ సంపుటంలో 1 నుండి 6 అనువాకములు కలిపి 71 సూక్తములు, 10వ సంపుటంలో 7 నుండి 9 అనువాకాలు కలిపి 72 నుండి 126 సూక్తములు, 127 నుండి 143 వరకు కుంతాప సూక్తములు ఉన్నాయి.
 
9. శ్రీ వచన సౌరభం రచయిత- డా|| చిఱ్ఱావూరి శివరామకృష్ణశర్మ
తమిళంలో పిళ్ళైలోకాచార్యులు రాసిన ‘శ్రీవచనభూషణం’ శ్రీవైష్ణవ గ్రంథానికి తెలుగు అనువాదమే ”శ్రీవచనసౌరభం” శ్రీ కోరుకొండబట్టర్‌ రామానుజగారి ఈ అనువాద గ్రంథంలో ప్రపత్తి స్వరూపం. ప్రపన్నుని లక్షణాలు, దినచర్య భగవత్కైంకర్యం, భగవదపచారం, భాగవతపచారం, అర్చావతార వైశిష్ట్యం సచ్చిష్య లక్షణాలు, ఆచార్యప్రాశస్త్యం మున్నగు అనేక విషయాలు ఈ గ్రంథంలో వివరించబడినాయి.
 
10. యువలయం సావనీర్‌
 
దక్షిణభారత రాష్ట్రాలలోని కళాశాలలకు చెందిన యువతీ యువకుల్లో కర్నాటక సంగీత నైపుణ్యాన్ని ఉపాధ్యాయుల్లో బోధనా పద్ధతిని వెలికి తీయడంలో భాగంగా తి.తి.దే ప్రయోగాత్మకంగా ‘యువలయం’ పేరుతో నిర్వహించిన కర్నాటక సంగీత పోటీలకు సంబంధించిన సావనీర్‌ ను తి.తి.దే ఇ.ఓ మరియు ఛైర్మెన్‌లు ఈ కార్యక్రమంలో ఆవిష్కరించారు.
 
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.