రద్దీ ఏర్పాట్లపై తి.తి.దే సిబ్బందికి ఛైర్మెన్ కితాబు
రద్దీ ఏర్పాట్లపై తి.తి.దే సిబ్బందికి ఛైర్మెన్ కితాబు
తిరుమల, 9 జూన్ 2013: తిరుమలలో గత 5 రోజులుగా విపరీతంగా పెరిగిన రద్దీ దృష్ట్యా తి.తి.దే భక్తజన సందోహానికి నిరంతరాయంగా చేసిన ఆహార, త్రాగునీరు, అల్పాహార, క్షీర తదితర ఏర్పాట్లకు తి.తి.దే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు తి.తి.దే సిబ్బందిని ప్రశంసించారు.
వేసవి సెలవులు మరికొన్ని రోజులలో ముగియనుండడంతో తిరుమల గత కొన్ని రోజులుగా భక్తజన ప్రవాహాన్ని చవిచూసింది. ఈ నేపథ్యంలో రూ.300/-, రూ.50/-, సర్వదర్శనం, కాలిబాట భక్తుల క్యూలైన్లు కంపార్టుమెంట్లు అంతా నిండి బయటకు మూడు కిలోమీటర్ల మేరకు లైన్లు విస్తరించాయి. ఈ సందర్భంగా అన్నప్రసాదం, విజిలెన్సు, ఆరోగ్యశాఖ, శ్రీవారిసేవకులు తదితర విభాగాలు అహర్నిశలు శ్రమిస్తూ భక్తులకు విశేషసేవలను అందించాయి. సంబంధిత విబాగాధిపతులు తిరుమల జె.ఇ.ఓ శ్రీ కె.ఎస్.శ్రీనివాసరాజు నేతృత్వంలో మరియు సి.వి.ఎస్.ఓ శ్రీ జి.వి.జి అశోక్ కుమార్ పర్యవేక్షణలో భక్తులకు చేసిన ఏర్పాట్లను తి.తి.దే ఛైర్మెన్ ప్రశంసించారు.
అదే విధంగా సామాన్య భక్తుల దర్శనమే ప్రాధాన్యతగా తి.తి.దే ఆదివారంనాడు ప్రోటోకాల్ వి.ఐ.పి దర్శనాన్ని కూడా రద్దుచేసి తద్వారా కొన్ని వేలమంది భక్తులకు దర్శనాన్ని ఏర్పాటుచేయడాన్ని కూడా ఆయన ప్రశంసించారు. ఇక భక్తులు కూడా కొన్ని కిలోమీటర్ల మేరకు క్యూలైన్లు ఉన్నా దాదాపు 20 గంటలకు పైగా దర్శనానికి సమయం పడుతున్నా ఏమాత్రం సహనం కోల్పోకుండా సంయమనంతో వ్యవహరిస్తూ తి.తి.దేకు అందించిన సహకారానికి ఆయన ప్రతిఒక్క భక్తునికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.
తి.తి.దే ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.