Students should imbibe knowledge in space sciences – TTD JEO _ విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకోవాలి – టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి
– ఎస్‌జిఎస్ హైస్కూల్లో షార్ స్పేస్ ఎగ్జిబిషన్
తిరుపతి, 2023 అక్టోబర్ 07: టీటీడీ విద్యాసంస్థల్లో చదివే విద్యార్థులు అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన పెంచుకుని, ఆసక్తిగల వారు శాస్త్రవేత్తలుగా రాణించాలని టీటీడీ జేఈవో శ్రీమతి సదా భార్గవి పిలుపు నిచ్చారు .
ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల్లో భాగంగా శ్రీ గోవిందరాజస్వామి ఉన్నత పాఠశాలలో శనివారం నిర్వహించిన స్పేస్ ఎగ్జిబిషన్‌ను జేఈవో ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, శ్రీవారి ఆశీస్సులతో టీటీడీలోని 33 విద్యాసంస్థల్లో 29 వేల మంది విద్యార్థులు వివిధ రకాల విద్యను అభ్యసిస్తున్నారని తెలియజేశారు. అంతరిక్ష పరిశోధనలు చేస్తున్న శాస్త్రవేత్తల కృషిని అభినందించారు. టీటీడీ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరూ శ్రీహరికోటలోని షార్‌ను సందర్శించేందుకు ఏర్పాటు చేస్తామన్నారు. ఈ సందర్భంగా చంద్రయాన్-3 పోస్టర్‌ను ఆమె ఆవిష్కరించారు. ఈ పోస్టరును విద్యార్థులందరూ తమ ఇళ్లలో అంటించుకుని స్ఫూర్తిని పొందాలని సూచించారు. టీటీడీ విద్యార్థులకు షార్‌లో ఇంటర్న్ షిప్ తోపాటు తగిన ఉద్యోగావకాశాలు కల్పించాలని షార్ అధికారులను కోరారు. టీటీడీ విద్యార్థులు మన సంస్కృతి సంప్రదాయాల పట్ల అవగాహన పెంచుకుని విద్యార్థి దశ నుంచే వాటిని పాటించాలన్నారు.
టీటీడీ విద్యాశాఖ అధికారి డాక్టర్ ఎం.భాస్కర్ రెడ్డి మాట్లాడుతూ ప్రపంచ అంతరిక్ష వారోత్సవాల ప్రాధాన్యతను వివరించారు. మొదటి మానవ నిర్మిత ఉపగ్రహం గురించి తెలియజేశారు. విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్ఫూర్తిని పొందాలని, శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించుకోవాలని కోరారు. భవిష్యత్తులో శాస్త్రవేత్తలు కావడానికి కలలు కనాలని, వాటిని సాకారం చేసుకోవడానికి కృషి చేయాలని సూచించారు.
షార్ సీనియర్ సైంటిస్ట్ శ్రీ శంభుప్రసాద్ మాట్లాడుతూ శ్రీహరికోటలోని పిఎస్ఎల్వీ, జిఎస్ఎల్వీ, ఎల్వీఎం -3 లాంటి వాహనాల పని విధానాన్ని వివరించారు. ఉపగ్రహాల తయారీకి అన్ని రకాల ఇంజనీరింగ్ విద్యార్థుల అవసరం ఉంటుందని, విద్యార్థులు ఆసక్తి గల అంశాన్ని తీసుకుని నైపుణ్యం సాధించాలని తెలియజేశారు. విద్యార్థులు క్రమశిక్షణ, అంకితభావంతో కృషి చేస్తే ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చన్నారు.
షార్ గ్రూప్ డైరెక్టర్ శ్రీ గోపికృష్ణ మాట్లాడుతూ అంతరిక్ష వారోత్సవాలు శ్రీహరికోటలో మాత్రమే జరిగేవని, ఈ సంవత్సరం నుంచి దేశవ్యాప్తంగా గల ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహిస్తున్నామని తెలిపారు. ఎక్కువమంది శాస్త్రవేత్తలు తయారు కావడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడాలని ఆకాంక్షించారు. విద్యార్థులందరూ ప్రదర్శనలోని అంశాలను చక్కగా అర్థం చేసుకుని స్ఫూర్తిని పొందాలని కోరారు.
షార్ టెస్ట్ ఫెసిలిటీస్ మేనేజర్ డాక్టర్ టి.శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ శ్రీహరికోటలో జరిగే ప్రయోగాలన్నింటినీ ఈ ప్రదర్శనలో ఉంచామని, విద్యార్థులు శ్రద్ధగా తిలకించి అర్థం చేసుకోవాలని సూచించారు.
అనంతరం షార్ నిర్వహించిన క్విజ్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన 24 మంది టీటీడీ విద్యార్థులకు జేఈవో బహుమతులు ప్రదానం చేశారు. అతిథులను సన్మానించారు. కాగా, టీటీడీ పాఠశాలల్లోని 8, 9, 10వ తరగతులకు చెందిన సుమారు 1400 మంది విద్యార్థులు ఎగ్జిబిషన్‌ను తిలకించారు.
ఈ కార్యక్రమంలో టీటీడీ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు శ్రీ చంద్రయ్య, శ్రీ కృష్ణమూర్తి, శ్రీ సురేంద్ర, శ్రీమతి పద్మావతమ్మ, శ్రీమతి సంధ్య, ఇతర ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.