విశ్రాంతి మండపం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖకు లేఖ రాశాం – టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
విశ్రాంతి మండపం పునర్నిర్మాణంపై పురావస్తు శాఖకు లేఖ రాశాం – టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి
తిరుమల, 2023 నవంబరు 08: అలిపిరి నడకమార్గం ప్రారంభంలో పాదాల మండపం వద్ద ఉన్న ఒక విశ్రాంతి మండపం కూలిపోయే స్థితిలో ఉందని, మరమ్మతులు చేయడానికి వీలు లేకపోవడం వల్ల పునర్నిర్మాణం తప్పనిసరి అని సాంకేతిక నిపుణులు నివేదిక సమర్పించారని టీటీడీ ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి తెలిపారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయలో బుధవారం విలేఖరి అడిగిన ప్రశ్నకు ఈవో సమాధానమిస్తూ ఈ మండపం నిర్మాణం చేపట్టే సమయంలో కొందరు వ్యక్తులు పురావస్తు శాఖ అనుమతి తీసుకుని నిర్మించాలని వ్యక్తీకరించారని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియాకు లేఖ రాశామని, పురావస్తు శాఖ అనుమతి అవసరమా లేదా తెలియజేయాలని కోరామని తెలియజేశారు. పురావస్తు శాఖ అనుమతి అవసరమైతే అనుమతులు ఇవ్వాలని, లేకపోతే టీటీడీనే పునర్నిర్మిస్తుందని లేఖలో తెలియజేశామన్నారు.
పురావస్తు శాఖ అనుమతి ఇచ్చాక పురాతన విశ్రాంతి మండపంలోని రాతి స్తంభాలను, పైకప్పులో ఉన్న రాతిబండలను, ఉపయోగకరంగా ఉన్న మెటీరియల్‌ను తిరిగి ఉపయోగించడం జరుగుతుందన్నారు. ఉపయోగకరంగా లేని మెటీరియల్ స్థానంలో కొత్త వాటిని ఉపయోగించి యథాతథంగా మండపాన్ని పునర్నిర్మించాలని టీటీడీ నిర్ణయించిందని తెలిపారు.
తిరుమలలోని పార్వేట మండపం, అలిపిరి పాదాల వద్దగల విశ్రాంతి మండపం పురావస్తు శాఖ పరిధిలో లేవని, పురావస్తు శాఖ జాబితాలో లేని వాటికి టీటీడీనే మరమ్మతులు చేపట్టి నిర్వహిస్తోందన్నారు. పార్వేట మండపం కూలిపోయే స్థితిలో ఉంటే రాతి మండపాన్ని పునర్నిర్మించామని, పాత మండపంలోని శిల్పాలను, కళాఖండాలను అదేరీతిలో కొత్త మండపంలో ఏర్పాటు చేశామని చెప్పారు. కొత్త మండపాన్ని కొద్దిగా ఎత్తు పెంచి స్వామివారు వేంచేపునకు, ఉత్సవాలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉండేలా తయారు చేశామని వివరించారు. రాతి మండపాన్ని రాతి మండపంగానే పునర్నిర్మించడం జరిగిందని, పురావస్తు శాఖ నిబంధనలను పాటించామని తెలియజేశారు.
టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.