వేద విజ్ఞానంతో ప్రత్యామ్నాయ సైన్సు అభివృద్ధి జరగాలి : తిరుపతి జెఈవో

వేద విజ్ఞానంతో ప్రత్యామ్నాయ సైన్సు అభివృద్ధి జరగాలి : తిరుపతి జెఈవో

తిరుపతి, జూన్‌ 13, 2013: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం దుష్పరిణామాలతో మానవాళికి ముప్పు పొంచి ఉన్న నేటి తరుణంలో వేద విజ్ఞానం ద్వారా ప్రత్యామ్నాయ సైన్సు అభివృద్ధి జరగాల్సి ఉందని తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి అభిప్రాయపడ్డారు.
 
తిరుపతిలోని శ్వేత భవనంలో గురువారం ఉదయం ‘వేదాల్లో దాగి ఉన్న శాస్త్రీయ  విజ్ఞానం’ అనే అంశంపై తితిదే ఉద్యోగులకు అవగాహన సదస్సు జరిగింది. ముఖ్య అతిథిగా విచ్చేసిన జెఈవో మాట్లాడుతూ వేదాల్లో పరమాత్మ, ఇతర ఆధ్యాత్మిక విషయాలే గాక మానవాళికి అవసరమైన విలువైన శాస్త్రీయ విజ్ఞానం ఇమిడి ఉందన్నారు. వేద కాలంలోనే మన పూర్వీకులు గణితం, భౌతికశాస్త్రం, ఆస్ట్రానమి, ఆస్ట్రాలజి తదితర శాస్త్రాలపై విస్తృతమైన అధ్యయనం, పరిశోధనలు చేసినట్టు తెలిపారు. హైందవ ధర్మంలో వేల సంవత్సరాల నుండి ఈ సంపద మనకు వారసత్వంగా అందుతోందన్నారు.
 
అనంతరం ముఖ్య వక్త, హైదరాబాదులోని ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైంటిఫిక్‌ రీసర్చి ఆన్‌ వేదాస్‌(ఐ సర్వ్‌) అధ్యకక్షులు బ్రహ్మశ్రీ కుప్ప వెంకటకృష్ణమూర్తి కీలకోపన్యాసం చేశారు. విజ్ఞానశాస్త్రం, సాంకేతిక పరిజ్ఞానం వేరువేరు అన్నారు. ప్రస్తుతం సాంకేతిక పరిజ్ఞానంపై పరిశోధనలు పెరిగి పోయాయని, విజ్ఞానశాస్త్రంపై పూర్తిగా తగ్గిపోయాయని చెప్పారు. ఈ కారణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెంది వాతావరణ కాలుష్యం, గ్లోబల్‌ వార్మింగ్‌ పెరుగుతున్నా యన్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే మరో వంద సంవత్సరాల్లో ప్రకృతి వనరులన్నీ తరిగిపోయి మానవాళి ఉనికికే ప్రమాదం ఏర్పడుతుందని పరిశోధనలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితిని ఎదుర్కోవాలంటే వేదాలకు తిరిగి వెళ్లడం ఒక్కటే మార్గమన్నారు. వేదకాలంలో విజ్ఞానశాస్త్రంపై సంస్కృత భాషలో వేల గ్రంథాలు వచ్చాయని, కాలక్రమంలో అవి మరుగున పడిపోయి ప్రస్తుతం వందల సంఖ్యలో మిగిలాయని వెల్లడించారు. ఇలాంటి గ్రంథాలన్నింటినీ సేకరించి పండితుల సమక్షంలో పరిశోధనలు జరగాల్సి ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఆయన పవర్‌పాయింట్‌ ప్రజంటేషన్‌ ద్వారా వేదాల్లోని విజ్ఞానాంశాలను వివరించారు. న్యూటన్‌ గురుత్వాకర్షణ సిద్ధాంతం, మైక్రోస్కోపు, పైథాగరస్‌ సిద్ధాంతం, శస్త్రచికిత్స, మైనింగ్‌, సోలార్‌ సైన్స్‌ తదితర అంశాలపై వేదాల్లో ఉన్న శ్లోకాలను చూపారు.
ఈ కార్యక్రమంలో తితిదే ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్‌, చీఫ్‌ ఇంజినీర్‌ శ్రీ చంథ్రేఖర్‌రెడ్డి, ప్రత్యేకశ్రేణి ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ టిఏపి.నారాయణ, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ ఆచార్య రవ్వా శ్రీహరి, ముఖ్య అంకణీయ అధికారి శ్రీ శేషశైలేంద్ర, శ్వేత సంచాలకులు డాక్టర్‌ కె.వి.రామకృష్ణ, ఎస్వీ ఉన్నత వేదాధ్యయన సంస్థ ప్రత్యేకాధికారి శ్రీ విభీషణశర్మ, తితిదే ఉద్యోగులు పాల్గొన్నారు.

తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.