వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర
వైభవంగా తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర
తిరుపతి, జూన్ 22, 2013: తిరుమల శ్రీవారి లక్ష్మీహారం శోభాయాత్ర శనివారం తిరుపతి, అప్పలాయగుంటలో వైభవంగా జరిగింది. అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శనివారం రాత్రి జరుగనున్న గరుడసేవలో స్వామివారికి అలంకరించేందుకు లక్ష్మీహారాన్ని శోభాయాత్రగా తీసుకెళ్లారు.
ఈ సందర్భంగా తితిదే పాలకమండలి అధ్యకక్షులు శ్రీ కనుమూరు బాపిరాజు మీడియాతో మాట్లాడుతూ స్థానిక ఆలయాల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు. అక్కడ అన్ని వసతులు కల్పిస్తుండడంతో భక్తుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నారు. ఈ క్రమంలోనే అప్పలాయగుంటలోని శ్రీ ప్రసన్న వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలను అంగరంగ వైభవంగా నిర్వహిస్తున్నట్టు చెప్పారు. తితిదే అధికారులు సమన్వయం చేసుకుని బ్రహ్మోత్సవాలను విజయవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు.
తితిదే కార్యనిర్వహణాధికారి శ్రీ ఎల్వీ సుబ్రమణ్యం మాట్లాడుతూ స్థానిక ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు తిరుమల శ్రీవారి ఆభరణాలను తీసుకెళ్లడం ఆనవాయితీగా వస్తోందన్నారు. లక్ష్మీహారాన్ని స్వామివారి ఉత్సవమూర్తికి అలంకరించడం వల్ల శ్రీవారి మహిమ వ్యాపించి ఆ ప్రాంతమంతా సస్యశ్యామలం అవుతుందని పేర్కొన్నారు. బ్రహ్మోత్సవాల్లో ఇప్పటివరకు మహిళలకు రెండు లక్షల గాజులను పంపిణీ చేసినట్టు వెల్లడించారు. హైందవ సంప్రదాయంలో మహిళల అయిదోతనానికి గాజులు ప్రతీక అని ఆయన తెలిపారు.
అంతకుముందు లక్ష్మీహారాన్ని తిరుమల శ్రీవారి ఆలయ ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ చిన్నంగారి రమణ, ఇతర అధికారులు శ్రీనివాసం వద్దకు తీసుకొచ్చారు. అక్కడ ప్రత్యేక వాహనంపై లక్ష్మీహారాన్ని ప్రదర్శనకు ఏర్పాటుచేశారు. శ్రీనివాసం నుండి శంకరంబాడి వలయం వరకు శోభాయాత్ర సాగింది. అనంతరం అప్పలాయగుంట పురవీధుల్లో ఊరేగింపుగా లక్ష్మీహారాన్ని స్వామివారి ఆలయానికి తీసుకెళ్లారు. భక్తజన బృందాల కోలాటాలు, చెక్కభజనలు, మంగళవాయిద్యాల నడుమ శోభాయమానంగా యాత్ర సాగింది.
ఈ కార్యక్రమంలో తితిదే తిరుపతి సంయుక్త కార్యనిర్వహణాధికారి శ్రీ పి.వెంకట్రామిరెడ్డి, ముఖ్య నిఘా మరియు భద్రతాధికారి శ్రీ జివిజి.అశోక్‌కుమార్, ఎస్ఈ శ్రీ రామచంద్రారెడ్డి, స్థానిక ఆలయాల ఉపకార్యనిర్వహణాధికారి శ్రీ భాస్కర్‌రెడ్డి, సహాయ కార్యనిర్వహణాధికారులు శ్రీ నాగరత్న, శ్రీ లక్ష్మీనారాయణ యాదవ్, అప్పలాయగుంట ఆలయ అధికారులు, అర్చకులు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.
తి.తి.దే., ప్రజాసంబంధాల అధికారిచే జారీ చేయబడినది.