PAVITROTSAVAMS COMMENCES _ వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు
వైభవంగా ప్రారంభమైన శ్రీ కోదండరామస్వామి పవిత్రోత్సవాలు
తిరుపతి, 2024 జూలై 31: తిరుపతి శ్రీ కోదండరామస్వామివారి ఆలయంలో బుధవారం పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా ప్రారంభమయ్యాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో తెలియక కొన్ని దోషాలు జరుగుతుంటాయి. వీటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు.
ఇందులో భాగంగా ఉదయం శ్రీ సీతారామ సమేత లక్ష్మణస్వామివారి ఉత్సవమూర్తులను విమాన ప్రదక్షిణగా యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ స్నపనతిరుమంజనం వేడుకగా జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు, కొబ్బరినీళ్లతో స్వామి, అమ్మవారి ఉత్సవమూర్తులకు అభిషేకం చేశారు. అనంతరం శాత్తుమొర, ఆస్థానం నిర్వహించారు.
సాయంత్రం శ్రీ సీతారామలక్ష్మణులు బంగారు తిరుచ్చిపై ఆలయ మాడవీధుల్లో విహరించి భక్తులకు దర్శనమిస్తారు.
రాత్రి పవిత్ర ప్రతిష్ట, శయనాధివాసం తదితర కార్యక్రమాలు చేపడతారు.
ఈ కార్యక్రమంలో డెప్యూటీ ఈవో శ్రీమతి నాగరత్న, కంకణభట్టార్ శ్రీ సీతారామాచార్యులు, సూపరింటెండెంట్ శ్రీ సోమ శేఖర్, టెంపుల్ ఇన్‌స్పెక్టర్లు శ్రీ చలపతి, శ్రీ సురేష్ పాల్గొన్నారు.
టీటీడీ ముఖ్య ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.